ఫ్రాన్స్‌లో లీపెన్‌ ఆధిక్యం

Le Pen leads in France
France Election

– గట్టి పోటీ ఇస్తున్న న్యూ పాపులర్‌ ఫ్రంట్‌
– రెండో రౌండ్‌లో
స్వల్పంగా పెరిగిన పోలింగ్‌
పారిస్‌: ఫ్రాన్స్‌ పార్లమెంటు రెండో రౌండ్‌ ఎన్నికలకు సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి మెరైన్‌ లీపెన్‌ నేతృత్వంలోని నియో ఫాసిస్టు పార్టీ నేషనల్‌ ర్యాలీ (ఆర్‌ఎన్‌) ఆధిక్యంలో ఉంది. అయితే, 577 సీట్లు ఉన్న పార్లమెంటులో సాధారణ మెజార్టీకి అవసరమైన 289 స్థానాలు ఏ పార్టీకి లేదా కూటమికి దక్కే సూచనలు కనబడడం లేదు. ఒక ఫాసిస్టు పార్టీ అధికారానికి దగ్గరగా రావడం రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇదే మొదటిసారి. ఇయు ఎన్నికల్లోనూ ఫ్రాన్స్‌ నుంచి అది అతిపెద్ద పార్టీగా అది నిలిచింది. ఇమ్మిగ్రెంట్‌ హిస్టీరియాను రెచ్చగొట్టడం ద్వారా జీవనోపాధి, అధిక ధరలు వంటి సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లింపజేసింది. లీపెన్‌ పార్టీ ఫాసిస్టు ఎజెండాకు ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలతో ముందుకొచ్చిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ (ఎన్‌పిఎఫ్‌) ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీ, గ్రీన్స్‌, ఫ్రాన్స్‌ అన్‌బౌండ్‌ వంటి వామపక్ష ప్రగతిశీల శక్తులతో కూడిన పాపులర్‌ ఫ్రంట్‌ మొదటి రౌండ్‌లో 28.1 శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది. నేషనల్‌ ర్యాలీ తో పోల్చితే ఓట్ల తేడా కేవలం 5శాతం మాత్రమే. రెండవ రౌండ్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ తన ఓటింగ్‌ బలాన్ని కొంత మేర పెంచుకుంది. అధ్యక్షుడు ఇమానియెల్‌ మాక్రాన్‌ నాయకత్వంలోని రినైజాన్స్‌ పార్టీకి రెండో రౌండ్‌లోనూ పరాభవం తప్పలేదు.మాక్రాన్‌ పార్టీకి ఫ్రెంచ్‌ ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి దళాలు, నిధులు సమకూర్చిన మాక్రాన్‌, దేశీయంగా పొదుపు చర్యల పేరుతో సామాజిక సంక్షేమంపై ఎడాపెడా కోత పెట్టారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా 2018-19లో యెల్లో వెస్ట్‌ ఉద్యమం పెద్దయెత్తున సాగింది. 577 సీట్లు ఉన్న ఫ్రాన్స్‌ పార్లమెంటులో మొదటి రౌండ్‌లో 76 మంది ఎన్నిక కాగా, మిగతా 506 స్థానాలకు రెండో రౌండ్‌లో ఎన్నికలు జరిగాయి. పార్లమెంటులో సాధారణ మెజార్టీ సాధించాలంటే కనీసం 289 సీట్లు రావాలి. ఈ మ్యాజిక్‌ పిగర్‌ను ఏ పార్టీ లేదా కూటమి సాధించే స్థితి కనబడడం లేదు. పోలింగ్‌ సరళి చూస్తే మొదటి రౌండ్‌ కన్నా రెండో రౌండ్‌లో కొంచెం ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 వరకు పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నానికి 26.68శాతం, సాయంత్రం 5 గంటలకు 59.71 శాతం ఓట్లు పోలైనట్లు ఆంతరంగిక శాఖ తెలిపింది.

Spread the love