Sunday, August 9, 2026
E-PAPER
Homeఖమ్మంఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం: మంత్రి సీతక్క

ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం: మంత్రి సీతక్క

- Advertisement -

– అశ్వారావుపేటలో కొమరం భీమ్ విగ్రహావిష్కరణ
– ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దానసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.

జిల్లాకు విచ్చేసిన మంత్రి సీతక్కకు ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, కొమ్ము డాన్స్‌లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ తదితరులు ఆదివాసీ ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా ప్రధాన కూడలికి చేరుకుని కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొమరం భీమ్ హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం కోసం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సమ్మక్క–సారలమ్మ, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి మహనీయుల పోరాటాలు ఆదివాసీ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, అడవిపై హక్కులు, భూమిపై హక్కులు, విద్య, ఉపాధి, గృహాలు వంటి ప్రాథమిక అవసరాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను అధికారులు గౌరవంగా చూడాలని, వారి సమస్యలను ఓపికగా విని పరిష్కరించాలని సూచించారు.

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.1,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్, రోడ్లు–భవనాల శాఖల ద్వారా మరిన్ని అభివృద్ధి పనులకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

కొమరం భీమ్ ఇచ్చిన “జల్–జంగల్–జమీన్” నినాదాన్ని గుర్తు చేస్తూ, ఆదివాసీ యువత ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానమే వారి అస్థిత్వమని, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తమ మూలాలను, మాతృభాషను మరచిపోవద్దని సూచించారు.

– విద్యాభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
ఆదివాసీ సమాజంలో ఐక్యత, చైతన్యం, విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. కొమరం భీమ్ పేరుతో ఏర్పాటు చేయనున్న అర్బన్ పార్కును అభివృద్ధి చేసి, అక్కడ గిరిజన మ్యూజియం, గిరిజన విద్యా వికాసం భవనం ఏర్పాటు చేయడానికి సహకరించాలని మంత్రి సీతక్కను కోరారు.

– సంక్షేమం, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యం: కలెక్టర్ అంకిత్
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కొమరం భీమ్, రాంజీ గోండు, సమ్మక్క–సారలమ్మ వంటి వీరుల పోరాట చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి రంగాల్లో ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ విద్యా చందన, జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ జిల్లా నాయకులు తుమ్మ రాంబాబు,మండల నాయకులు చిన్నం శెట్టి సత్యనారాయణ,ఆదివాసీ జేఏసీ నాయకులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, కొండరెడ్డి, నాయకపోడు తదితర గిరిజన వర్గాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -