– కారు పోయింది సర్వీసింగ్‌కే..
– బీజేపీ వచ్చాకనే మనం బొట్టు పెట్టుకోవడం నేర్చుకున్నామా..
– చేవెళ్లలో గులాబీ జెండా ఎగురవేద్దాం: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– పార్టీ చేవెళ్ల, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశం
నవతెలంగాణ-చేవెళ్ల
రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్‌ను ఓటుతో కొడదామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని చేవెళ్ల, పరిగి నియో జకవర్గాల పార్టీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 14 ఏండ్లపాటు కారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉరికిందని, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా తిరిగిందన్నారు. ప్రస్తుతం కారు సర్వీసింగ్‌కు మాత్రమే పోయిందని తెలి పారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారనీ, అందులో బలంగా మన వాణిని వినిపిస్తామనీ అన్నారు. 14 సీట్లలో చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయామని తెలిపారు. ఇప్పటి వరకు రెండెకరాల వరకే రైతుబంధు వచ్చిందని, రేవంత్ ఇస్తానని చెప్పిన రూ.15 వేలు ఎక్కడని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇబ్బందులకు గురి చేయకుంటే రూ. 7,500 కోట్లు 70 లక్షల మంది రైతుల అకౌంట్‌లలో పడేవ న్నారు. దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లా డారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ సామాన్య కార్యకర్త మాట్లాడే దానికంటే అధ్వానంగా ఉందన్నారు. మన నాయకుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తారని తెలిపారు.
బీజేపీ దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు
బీజేపీ వచ్చాకే మనం బొట్టు పెట్టుకోవడం నేర్చుకున్నా మనేలా ఆ పార్టీ నేతలు మాట్లాడున్నారని కేటీఆర్ విమర్శిం చారు. ఐటీఐఆర్‌పై బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడ లేదన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో మాట్లాడేది బీ ఆర్‌ఎస్ మాత్రమే అన్నారు. వ్యక్తిగత విభేదాలు పక్కకు పెట్టి అందరూ కలిసి పని చేయాలని, చేవెళ్లపై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. వికారాబాద్ జిల్లా పూడూర్‌లో చేపట్టే నేవీ ర్యాడర్ స్టేషన్‌పై ప్రజాభిప్రాయం చేపట్టాలని డిమాండ్ చేశారు. నేవీ ర్యాడర్‌కు 12లక్షల చెట్లు కొట్టేయ డం వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ఇందుకు వ్యతి రేకంగా పోరాడే వారికి బీఆర్‌ఎస్ మద్దతుంటుందని చెప్పారు.
సమావేశానికి చేవెళ్ల ఎమ్మెల్యే దూరం
చేవెళ్లలో నిర్వహించిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరు కాలేదు. రెండ్రోజుల కిందటే ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. అయితే ఎమ్మెల్యే ఒక రోజు ముందు నుంచే అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. ఈ విషయంపై ఆరా తీస్తే ఇంట్లో ఎమ్మెల్యే కాలుజారి పడినట్టు కేటీఆర్‌కు సమాచారం ఇచ్చారు. నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సభలో పార్టీ శ్రేణులు ప్రకటించారు. కొంతమంది మాత్రం కావాలనే ఎమ్మెల్యే రాలేదాని చర్చించుకుంటున్నారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, నాయకులు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.