వసంత కా(కో)కిలా…..

వసంత కా(కో)కిలా.....కాకి కోకిల అవుతుందా… కంచు కనకం అవుతుందా అని నానుడి ఉంది, రఫీ గారు పాడిన పాట కూడా ఉంది. కాకి కోకిల కాలేదు కాని ప్రకృతిని శుభ్రంగా పెట్టడంలో మునిగి ఉంటుంది. కావుకావుమని అరుస్తుందే కాని తన వాళ్ళలో ఒక్కరికి కష్టమొచ్చినా, అన్యాయం జరిగినా సహించదు, తిరగబడుతుంది. కోకిల అలా కాదు, తన ఆనందం కోసమే పాడుకుంటుంది. ఎంత ఓపికలేనిదంటే కాకి గూట్లోనే గుడ్లు పెట్టి తన పిల్లలను పొదిగిస్తుంది, ఫ్రీగా. కాకి సరోగసి చేసిన మొదటి జీవిపైన కనిపించే వాటిలో. సముద్రాల్లో ఇలాంటివి ఎన్నో జరుగు తుంటాయి కాని మనకు కనిపించవు. మళ్ళీ కాకి దగ్గరకొస్తే, నమ్మకమున్నోళ్ళకు కాకిపై భక్తి కూడా ఉం టుంది. తమ పెద్దవాళ్ళను వాటిలో చూసుకుం టారు. తన గుడ్లను తినేసిన నాగుపాముపై పగ తీర్చుకోవడం కోసం, రాణిగారి నగలను తెచ్చి దాని పుట్టలో వేసి రాజభటుల ద్వారా చంపిస్తుంది కాకి ఓ కథలో. ఎంతో తెలివైనది కాకి. కవులు కోకిలపై రాసిన వారున్నారు, అలాగే కాకిపై కూడా రాశారు చాలా మంది. కోకిలకి కళ్ళు ఎర్రగా ఉంటాయి కాని కోపం రాదు. అదే కాకికి కళ్ళు ఎర్రగా లేకపోయినా కళ్ళెర్ర చేసినంత కోపమొస్తుంది అన్యాయాన్ని చూసినప్పుడు. సాయం చేయడంలో కాకికి కోయిలకు పోలికే లేదు.
ఓట్ల పండుగొచ్చింది. జమిలి అని ఇంకోటని గజిబిజి చేసే మాటలూ తెచ్చింది. ఏ రోజూ కనిపించని నాయకులు పొలోమని తూనీగల్లా, కందిరీగల్లా, తేనెటీగల్లా గిరికీలు కొడుతున్నారు. ఒకరి మీద ఒకరు అస్త్రాలు వేస్తున్నారు, వేయించుకుంటున్నారు. మా మిత్రుడంటుంటాడు వీళ్ళంతా ఆలీబాబా నలభై దొంగల్లో భాగమని. ఆ కథే తీసుకుంటే నలభై దొంగలూ ఒకేసారి వచ్చి వెడతారు. అందరూ ఒకే మాట మీద ఉంటారు. దొంగలకూ ఒక క్రమశిక్షణ ఉండా లని అన్నా అనొచ్చు. ఏమైనా అన్న రామారావు ఆలీబాబా నలభై దొంగలను తెరపై చూపించాడు. ఆయన సినిమాల్లో తెర దించేశాక రాజకీయాల్లో తెర లేపాడు. ఇదంతా చెప్పడం ఎవరికీ ఈ విషయాలు తెలియవని కాదు, ఒకసారి గుర్తు చేద్దామనే. మెట్రో రైళ్ళొచ్చి హైదరా బాదులో జనాల ప్రయాణం ఎలా వేగం పెంచారో ఆయన రాజకీయాల్లో వేగం పెంచాడు. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టినా అదంతా పాతవాళ్ళను ఇతర పార్టీలవాళ్ళనో తన దాంట్లో చేర్చుకొనే ఇదంతా చేశాడు కదా అనుకోవచ్చు. అది నిజం కూడా. కొద్దిమంది మినహా మిగతా వాళ్ళందరూ పాతోళ్ళే. కొత్త సీసాలో పాత సారానే.
ఎన్నికలొస్తే వాతావరణం వేడెక్కుతుంది. నాయకు లంతా మాంచి కాక మీద ఉన్నారు. ప్రతిఒక్కరూ పొయ్యి వెలిగించి ఉఫ్ఫు ఉఫ్ఫుమని ఊదరగొడు తున్నారు. వీళ్ళ వేడికంటె ముందు వాతా వరణమే వేడిగా తయారయింది. భూగో ళంపై ఉష్ణోగ్రత అంతకంతకూ పెరుగు తోంది. భూమి వేడెక్కడం మొదలు పెట్టిన ప్పటినుండి రుతువులు కనిపించకుండా పోయాయి. చెట్లు కొండలు కొట్టేసి వ్యాపా రాలు చేస్తుంటే వాతావరణం మారకుండా ఉంటుందా. దేశంలోని చెట్లన్నీ లెక్కవేసి ఒక్కో మనిషికి ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తే ఇరవై ఒకటి అని లెక్క తేలింది. అదే ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంది. మనుషులు, వారి ప్రాణాలే లెక్క లేకుండా పోతున్న సమయంలో చెట్ల గురించి చెబు తారేమి అని ఎవరైనా అడిగితే సమాధానాలు దండిగే ఉన్నాయి. అసలు ఈ భూమి మీద చెట్లు వచ్చి ఎన్నో ఏండ్లు గడిచాకనే మనిషి పుట్టడం జరిగింది. నేను పుట్టాను భోగోళం ఏడ్చింది అని పాడి ఉండొచ్చునేమో తెలీదు కాని అంతపనీ చేస్తున్నారు ఈ మనుషులు. తాము పుట్టాక ఎన్నో జీవజాతులను భూమి మీద లేకుండా చేశారు. ఏమన్నా అంటే కర్బన ఉద్ఘారాలని ఇంకోటనీ ఇతర దేశాల మీదికి వేస్తారు. వారు చేయిస్తున్న యుద్ధాల గురించి తాము కాని ఇంకొకరు కాని మాట్లాడకూడదు. ఇదంతా భూమి మీద, భూమి మీద ఉన్న రుతువుల పైన ప్రేమతోనే.
వసంత రుతువులో కోయిలలు కూస్తాయి. ఎండి రాలిపోయిన ఆకుల స్థానంలో కొత్త ఆకులు చిగురిస్తాయి. మనిషిలోనూ అంతే. ప్రకృతిని చూసి కదా మనిషి నేర్చు కునేది. ఐతే ఈ వసంత కోకిల ఎప్పుడొస్తుందో ఎంత తొంద రగ పోతుందో, అన్ని రోజులు తనతో ఉన్నవాళ్ళను గుర్తు కూడా పెట్టుకోదని సినిమా కూడా వచ్చింది. తనంతట తాను వస్తుంది, తన పనైపోగానే పోతుంది. సింపుల్‌గా వసంతకోకిల పరిచయం ఇది. ఇప్పుడున్న రాజకీయ వాతా వరణం చూస్తే ఈ వసంత కోకిలే గుర్తుకొస్తుంది. అలా వచ్చి ఇలా పోయే వారి గురించి తీయగా కృష్ణశాస్త్రిలా మనం రాయలేం, శ్రీశ్రీలా పదునుగా రాయాల్సిందే వారిపై. కోయిల పాటలాగా పెద్ద కోయిలలు, చిన్నవి ప్రజల గురించి పాడుతాయి. ఎంత తీయగా అంటే సినారే ఘజల్‌లా శ్రావ్యంగానన్న మాట. అది కొద్దిసేపే, వెంటనే అపరిచితు డిలా తల ఈ పక్కకు తిప్పి ఇతర రాజకీయ పక్షాలపై కాకి లాగ అరుస్తారు. స్వీటుగా మాట్లాడిన గొంతుతోనే చెవుల దిరిపోయేలా దుష్ట సంహారం చేస్తామని పలుకుతారు. అటు నుంచి కూడా అంతే.
పైన చెప్పుకున్నట్టు కోకిల కాకి గూట్లో గుడ్లు పెట్టినట్టు కొంతమంది ఎన్నికల వసంత కోయిలలు వేరే పార్టీల్లోకి తమ వాళ్ళను పంపి, ఎన్నికలప్పుడు తిరిగి ఘర్‌ వాపసి అనో ఇంకో పేరుతోనో మళ్ళీ వెనక్కు పిలిపించుకుంటారు. ఇది పక్కా కోకిల గుణం. ఇతరులను, ఇతరుల శ్రమను దోచుకు తినే గుణం. అందుకే కాకిలా నిత్యం మన వెంటే ఉన్నారా లేదా అని, వసంత కోకిలలా ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి అవి చేస్తాం, ఇవి చేస్తాం అని ఆప్తవాక్యాలు పలికే వాళ్ళను ఓ కంట కనిపెట్టి ప్రజలు తమ భవిష్యత్తును తామే బాగుపరచుకోవాలి. ఒకరిద్దరున్నా ఎప్పుడూ ప్రజల వైపే మాట్లాడేవారిని బలపరచి వాళ్ళ సంఖ్యను పెంచుకో వడం కూడా ప్రజల కర్తవ్యమే.
కాకి, కోకిలల గురించి మాట్లాడి నన్నొదిలేశారని చిలుక అనవచ్చు. కోకిల కళ్ళు ఎర్రగుంటే నా ముక్కు ఎర్రగుం టుంది. అవి పాట పాడొచ్చు నేను ఏకంగా మాట్లాడతాను. చిలుక పలుకులంటారు ఎవరైనా ముద్దుముద్దుగా మాట్లా డితే. భాషతో సంబంధం లేకుండా ఏ భాషైనా నా భాషే. చిట్టీచిలకమ్మా అమ్మా కొట్టిందా అని నా పేరు వాడుకొని పిల్లలకు పాటలూ నేర్పుతారు. ఆ చిట్టీ చిలకమ్మా పాటని ముఖ్యమంత్రులెలా చెబుతారో మిమిక్రీ వాళ్ళు కూడా వాడు కుంటారు. పెద్దోళ్ళంతా ముదురు మాటలు మాట్లాడితే పిల్లల బ్యాచ్‌ చిలకపలుకులు పలుకుతారు అని చిలుకలు అలగొచ్చు. ఇంతలో గోరింక వచ్చి నా గురించి కూడా ఓ పది లైన్లు రాయొచ్చు కదా అనొచ్చు. ఇది మామూలు పక్షుల గురించి కాదమ్మా, రాజకీయ పక్షుల గురించి రాస్తున్నది, ఎక్కువ రాసి ఎడిటర్‌ గారిని, ఎడిట్‌ పేజి చూసే వారిని ఇబ్బంది పెట్టకూడదని అన్ని పక్షులకీ మనవి చేస్తూ ఈ ఎన్నికల వేళ ఎలక్షన్‌ పక్షుల గురించి జాగ్రత్తగా ఉండమని మనవి చేసుకుంటూ……

– జంధ్యాల రఘుబాబు
9849753298

Spread the love