ముడుపుల మత్తులో ఆబ్కారి శాఖ
కొండేటి శ్రీను కేవీపీస్ జిల్లా అధ్యక్షుడు
నవతెలంగాణ – హలియా
హాలియా సర్కిల్ లో ఉన్న అన్ని గ్రామాలలో మధ్యం ఏరులై పారుతున్నా పర్యవేక్షణ మరిచి ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం ముడుపుల కోసం కక్కుర్తి పడి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని కేవీపీస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అన్నారు. ఆరోపణలు వినిపిస్తున్నా కొన్ని సందర్భాల్లో కల్తీ మద్యం దొరికినా వైన్స్ షాపుల యాజమాన్యానికి తలొగ్గి వారు ఇచ్చే ముడుపుల కోసం కక్కుర్తి పడి డబ్బులను వెనకేసుకుంటున్నారని అంతర్గతంగా, బాహాటంగా చర్చ జరుగుతున్నప్పటికీ ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం మాకేం సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.
దసరా పండుగ సందర్భంగా హాలియా సర్కిల్ లో ఉన్న అన్ని బెల్ట్ షాపుల దగ్గర రూ. 1 వెయ్యి నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాలలో రైడింగ్ పేరుతో ధనార్జనే ధ్యేయంగా బాధితుల వద్ద ముక్కు పిండి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని, తక్షణమే ఆబ్కారీ శాఖ అధికారులు వైన్స్ పర్మిట్ రూమ్లల్లో కనీస వసతులు లేవని మరియు పర్మిషన్ లేని పర్మిట్ రూమ్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామాలలో బెల్ట్ షాప్ యజమానులు ప్రతి క్వార్టర్ పైన రూ.30 నుండి రూ.50 ఎక్కువ వసూలు చేస్తున్నారని, రాత్రి వేలల్లో అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముతున్నారని అన్నారు. పేద ప్రజలు, యువకులు మద్యానికి బానిసలై, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్, ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ ను కలిసి త్వరలో పూర్తి వివరాలు అందజేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దైద శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు దొంతల నాగార్జున, దోరేపల్లి మల్లయ్య,మేకల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



