Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేటు పాఠశాల వద్దు.. ప్రభుత్వ పాఠశాలే ముద్దు

ప్రయివేటు పాఠశాల వద్దు.. ప్రభుత్వ పాఠశాలే ముద్దు

- Advertisement -

సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్
నవతెలంగాణ – తుంగతుర్తి
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామంలోని ప్రతి పౌరునిపై ఉందని గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని  సంగెం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి, ప్రైవేట్ పాఠశాలలు వద్దు,ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవితకు మార్గమని, గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ బడిఈడు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మాట్లాడారు.

తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందుబాటులో ఉందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, మధ్యాహ్న భోజన పథకం గురించి వివరించారు. పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలు, మెరుగైన వసతులు, చదువుకోవడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రతి బిడ్డ అక్షరాస్యులుగా మారి ఉన్నత లక్ష్యాలు చేరాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.

గ్రామ ప్రజల, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో విద్యార్థుల సంఖ్య తగ్గినట్లయితే పాఠశాలను మూసివేయడం జరుగుతుందని, అప్పుడు గ్రామంలోని పేద విద్యార్థులకు విద్యను దూరం చేసినట్లు అవుతుందని అన్నారు. గ్రామంలోని యువత, విద్యావంతులు, మేధావులు పార్టీలకు అతీతంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి, బలోపేతం చేయడానికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి, ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ, వార్డు మెంబర్లు భాగ్యమ్మ, విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మారగాని వెంకటయ్య, మల్యాల రాములు, సరిత, బిక్షం రెడ్డి, రమేష్, బాలరాజు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -