లక్నో సూపర్‌ విక్టరీ

Lucknow Super Victory– టైటాన్స్‌పై 6 వికెట్లతో గెలుపు
– రాణించిన మార్‌క్రామ్‌, పూరన్‌
– గుజరాత్‌ 180/6, లక్నో 186/4
గుజరాత్‌ టైటాన్స్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. బ్యాట్‌తో, బంతితో టైటాన్స్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన సూపర్‌జెయింట్స్‌ 6 వికెట్ల తేడాతో సీజన్లో నాలుగో విజయం నమోదు చేసింది. ఎడెన్‌ మార్‌క్రామ్‌ (58), నికోలస్‌ పూరన్‌ (61) అర్థ సెంచరీలతో మెరువగా.. గుజరాత్‌ టైటాన్స్‌ 180 పరుగుల స్కోరు కాపాడుకోవటంలో విఫలమైంది.
నవతెలంగాణ-లక్నో
నికోలస్‌ పూరన్‌ (61, 34 బంతుల్లో 1 ఫోర్‌, 7 సిక్స్‌లు) దూకుడు కొనసాగుతుంది. ఐపీఎల్‌18లో మరో ధనాధన్‌ అర్థ సెంచరీ సాధించిన నికోలస్‌ పూరన్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ను గెలుపు బాటలో నడిపించాడు. ఓపెనర్‌ ఎడెన్‌ మార్‌క్రామ్‌ (58, 31 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో రాణించాడు. రిషబ్‌ పంత్‌ (21, 18 బంతుల్లో 4 ఫోర్లు) ఓపెనర్‌గా మెప్పించే ప్రయత్నం చేయగా.. ఆయుశ్‌ బదాని (28 నాటౌట్‌, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. 181 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే పూర్తి చేసిన సూపర్‌జెయింగ్స్‌ 6 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్‌ (56, 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), శుభ్‌మన్‌ గిల్‌ (60, 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీలతో చెలరేగారు. లక్నో బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ (2/34), రవి బిష్ణోరు (2/36) రాణించారు. గుజరాత్‌ టైటాన్స్‌కు ఐపీఎల్‌18లో ఆరు మ్యాచుల్లో ఇది రెండో పరాజయం కాగా.. సూపర్‌కింగ్స్‌కు ఆరు మ్యాచుల్లో ఇది నాలుగో విజయం. ఛేదనలో అర్థ సెంచరీతో పాటు రెండు మెరుపు క్యాచ్‌లు అందుకున్న ఎడెన్‌ మార్‌క్రామ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
ఆ ఇద్దరు మెరువగా
పేలవ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (21) ఓపెనర్‌గా కొత్త ప్రయత్నం చేశాడు. మార్‌క్రామ్‌ (58)తో కలిసి తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించిన పంత్‌ ఛేదనలో గట్టి పునాది వేశాడు. ప్రసిద్‌పై ఓ ఫోర్‌తో దూకుడు పెంచిన పంత్‌.. మరో షాట్‌కు వెళ్లి వికెట్‌ కోల్పోయాడు. ఫామ్‌లో ఉన్న నికోలస్‌ పూరన్‌ (61)తో జతకలిసిన మార్‌క్రామ్‌ లక్నోను గెలుపు దిశగా నడిపించాడు. రెండో వికెట్‌కు ఈ జోడీ 58 పరుగులు జోడించింది. మార్‌క్రామ్‌ అర్థ సెంచరీతో మెరువగా.. నికోలస్‌ పూరన్‌ ఓ ఫోర్‌, ఆరు సిక్సర్లతో 23 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు.ఈ ఇద్దరు నిష్క్రమించినా ఆయుశ్‌ బదాని (28 నాటౌట్‌) లాంఛనం ముగించాడు. 19.3 ఓవర్లలో 186 పరుగులు చేసిన లక్నో చెమట పట్టకుండా మరో విజయం ఖాతాలో వేసుకుంది. ప్రసిద్‌ కృష్ణ (2/26) రెండు వికెట్లతో రాణించాడు.
ఓపెనర్లు రాణించినా
తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్‌ (56), శుభ్‌మన్‌ గిల్‌ (60) అదిరే ఆరంభం అందించారు. 12.1 ఓవర్లలో తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించారు. ఓపెనర్లు ఇద్దరూ అర్థ సెంచరీలు బాదటంతో భారీ స్కోరుకు గట్టి పునాది పడింది. కానీ మిడిల్‌ ఆర్డర్‌లో ఎవరూ రాణించలేదు. జోశ్‌ బట్లర్‌ (16), వాషింగ్టన్‌ సుందర్‌ (2), నిరాశపరచగా..రూథర్‌ఫోర్డ్‌ (22), షారుక్‌ ఖాన్‌ (11 నాటౌట్‌) మెరుపులతో టైటాన్స్‌ 180 ప్లస్‌ పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో సూపర్‌జెయింట్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. లక్నో బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌, రవి బిష్ణోరు రెండు వికెట్లతో మెరిశారు.

Spread the love