నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలి: మద్దినేని తేజ రాజు

నవతెలంగాణ – గోవిందరావుపేట
రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి నిరుద్యోగ సమస్యను రూపుమాపాలని బీజేపీ మండల అధ్యక్షుడు మద్దినేని తేజ రాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో తహసీల్ధార్ కార్యాలయం ముందు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గినేని భాను ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిరుద్యోగులకు సంబంధించిన పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ సరళ దేవికి అందించారు. ఈ సందర్భంగా తేజ రాజు మాట్లాడుతూ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1: 100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని అన్నారు. 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలనీ డీఎస్సీ పరీక్ష ప్రస్తుత తేదీలను మార్చి కొత్త తేదీలను ప్రకటించాలని అన్నారు. ప్రభుత్వ అన్ని నియామకాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో జాబ్ క్యాలెండర్ను వెంటనే ప్రకటించాలని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు మార్క సతీష్, తుకాని మధు, మండల ప్రధాన కార్యదర్శి రవిశంకర్, శ్రీకాంత్ చారి, సంతోష్, ఐలయ్య, ఉమా తదితరులు పాల్గొన్నారు.

Spread the love