ప్రశ్నార్థకంగా ‘మన ఊరు.. మన బడి’..

– సర్కారు పాఠశాలల్లో కానిరాని అభివృద్ధి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
సర్కారు బడులు కుదేలవుతున్నాయి. సవాలక్ష సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల్లేక చదువులు కుంటుపడు తున్నాయి. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మన ఊరు.. మన బడి కార్యక్రమం జిల్లాలో అంతంతమాత్రంగానే అమలైంది. అత్యధిక పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. గత నాలుగు ఏండ్లుగా  పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మరెన్నో పనులు ఇంకా మొదలే కాలేదు. నిధులు సకాలంలో మంజూరు కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదే క్రమంలో ప్రభుత్వం మారిపోవడం, కొత్తగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉండటంతో ‘మన ఊరు.. మన బడి’ ముందుకు సాగుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళా ఇదే కార్యక్రమాన్ని మరో పేరుతో గానీ, కొత్త మార్గదర్శకాలతో గానీ కొనసాగిస్తే.. ఇప్పటి వరకు నిలిచిన నిఽధులు సకాలంలో మంజూరవుతాయా.. పాఠశాలల పునఃప్రారంభం కల్లా అభివృద్ధి పనులు పూర్తయి విద్యార్థులకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయా..? అనే చర్చ సాగుతోంది. మన ఊరు.. మన బడి కార్యక్రమం 2021 డిసెంబరులో ప్రారంభమైంది. నాటి నుంచి పాఠశా లల అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం నిధులు సక్రమంగా విడుదల చేయలేకపోవడమే దీనికి కారణమని చెబు తున్నారు. దీంతో పనులు నత్తనడకన సాగుతు న్నాయని పలువురు కాంట్రాక్టర్లు చెప్పారు. అప్పులు తీసుకొచ్చి పనులు చేసినప్పటికీ తమకు ఇంకా బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పునఃప్రారంభం నాటికి పనులు పూర్తయ్యేనా..?
ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికి ఇంకా 5 రోజులు కూడా మిగిలి లేవు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఈ పనులు పూర్తయ్యేనా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిధులు మంజూరైతే గానీ ఏదైనా చేయగలమని సంబంధిత కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కానీ పనులు అసంపూర్తిగా ఉండటంతో తరగతులకు వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తల్లిదండ్రులు అంటున్నారు. ఇదిలా ఉండగా మన ఊరు.. మనబడి కార్యక్రమం విషయంలో కొత్త సర్కారు తీసుకొనే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదెలా ఉండబోతుంది.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందింస్తుందనే విషయంపై విద్యాశాఖలో జోరుగా చర్చసాగుతోంది.
Spread the love