తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని హామీ
కార్మికశాఖ అధికారులు, యాజమాన్యంతో సీఐటీయూ చర్చలు
కార్మికుల సమస్యల పరిష్కారానికి యజమాన్యం అంగీకారం
సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మాణిక్
నవతెలంగాణ-పటాన్ చెరు
కార్మికుల 71 రోజుల పోరాటానికి బిస్లరీ ఇంటర్ నేషనల్ కంపెనీ యాజమాన్యం దిగివచ్చింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమలో అకారణంగా తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 71 రోజులుగా కార్మికులు సమ్మె నిర్వహించారు. వివిద రూపాల్లో పోరాటాలు చేశారు. పరిశ్రమలో యూనియన్ ఏర్పాటు చేసుకున్నారనే నెపంతో యాజమాన్యం యూనియన్ నాయకత్వాన్ని విధుల నుంచి తొలగించింది. దీనిని నిరసిస్తూ కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె ఫలితంగా జాయింట్ లేబర్ కమిషనర్ (జేసీఎల్) సమక్షంలో యాజమాన్యం, యూనియన్ మద్య ఒప్పందం జరిగింది. సీఐటీయూ నాయకత్వం పట్టుదలగా కార్మికులకు అండగా ఉంటూ పోరాటంలో పాల్గొని కార్మికుల పక్షాన పోరాటాన్ని జయప్రదం చేశారు.
కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ కార్మికశాఖ అధికారి వద్ద కేసులను నమోదు చేయగా యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. కాగా గురువారం జాయింట్ లేబర్ కమిషనర్ (జేసీఎల్) శ్యాంసుందర్ రెడ్డి సమక్షంలో జరిగిన చర్చలో యాజమాన్యం ప్రతినిధులు ఏజీఎం హెచ్‌ఆర్ జి.సురేష్, ప్రొడక్షన్ సప్లై చైన్ శ్రీ హర్ష, హెచ్‌ఆర్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, యూనియన్ అధ్యక్షులు అతిమేల మానిక్, జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి, ఇన్స్టిట్యూట్ కమిటీ సభ్యులు పాల్గొని చర్చలు జరిపారు. ఈ సందర్బంగా బిస్లరీ కంపెనీ యూనియన్ అధ్యక్షుడు అతిమేల మానిక్యం మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి యజమాన్యం అంగీకరించిందన్నారు. పోరాడిన కార్మికులకు జేజేలు అన్నారు. ఎటువంటి కండిషన్ లేకుండా యాజమాన్యం డ్యూటీలోకి తీసుకుంటామని, కార్మికుల షోకాజ్ చార్జిషీట్లను రద్దు చేయడంతో పాటు, కార్మికుల పైన పెట్టిన కేసులను తొలగిస్తామని, కార్మికుల సమస్యలను యూనియన్ తో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారన్నారు. కార్మికుల పట్ల ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టబోమని, పారిశ్రామిక ప్రశాంతత నెలకొల్పుతామని హామీ ఇచ్చారన్నారు.
ఒప్పందం కుదరడంతో సమ్మెను విరమించాలని కార్మికులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఐదుగురు కార్మికుల విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, తొలగించిన కార్మికులను తిరిగి పాత సర్వీసులో తీసుకొని హెచ్‌ఎండీఏ పరిధిలో ట్రాన్స్ఫర్ చేయడానికి యాజమాన్యం ముందుకు వచ్చిందని, కానీ కార్మికులు అంగీకరించలేదన్నారు. సమస్యను కోర్టులో తేల్చుకుంటామని కార్మికులు అంగీకరించారు. 71 రోజులుగా సుదీర్ఘంగా కార్మికులు ఐక్యంగా పట్టుదలతో సమ్మె చేశారని, వివిధ రూపాల్లో సమరశీలంగా పోరాటాలు నిర్వహించారన్నారు. కలెక్టరేట్, లేబర్ కమిషన్ కార్యాలయం ముట్టడి వంటి ఆందోళనలు చేశామన్నారు. కార్మికుల పోరాటానికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అండగా నిలిచిందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు బి.మల్లేష్, కార్మికుల పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతుగా నిలబడ్డారన్నారు. శాండ్విక్, కిర్బీ, సిబిఎల్ పార్లే, కోహేన్ ఎనర్జీ వివిధ సీఐటీయూ యూనియన్లు సంఘీభావంగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారని, వారందరికీ, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి బిస్లరీ యూనియన్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ చర్చల్లో యూనియన్ నాయకులు ప్రవీణ్ గౌడ్, సతీష్ గౌడ్, కృష్ణ కుమార్, శ్రీకాంత్, అమిత్, బసంత్, నాగరాజు, నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.



