సారవంతమైన భూములు
తీసుకుంటున్న ప్రభుత్వం
దొంగ సర్వే నంబర్లతో నోటిఫికేషన్లు
గ్రామ సభలు నిర్వహించకుండానే
భూ సేకరణ
పంటలు పండే భూములు
తీసుకోవద్దని రైతుల వేడుకోలు
రాత్రికి రాత్రి నోటిఫికేషన్లు
విడుదల చేస్తున్న అధికారులు
ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం
లేదని ఆవేదన
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి/న్యాల్‌కల్
కష్టాన్ని నమ్ముకున్న రైతన్నలు తమ భూములే ఆధారంగా జీవిస్తున్నారు. పంటల సాగు ద్వారా ఎందరికో తిండి పెడుతున్న వీరి భూములను పరిశ్రమల పేరుతో ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటుంటే బోరున విలపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్ మండలం మామిడ్గి గ్రామంలో 700 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారు. ఆ ఊరిలో భూ సేకరణ కోసం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉంది. వెయ్యి ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వగా జనరల్ అవార్డు కింద 600 ఎకరాలుగా పేర్కొన్నారు. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం దొంగసంతకాలతో రైతులు ఒప్పుకున్నారంటూ నోటిఫికేషన్లు వేస్తోంది. దానికి సంబంధించి వివరాలు అడిగితే అధికారులు ఇవ్వడం లేదు. చాలా మంది ఐదారు ఎకరాలకు చెందిన రైతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో 300 మంది రైతులు ఉంటే ఎనిమిది మంది రైతులతో దొంగసంతకాలు తీసుకున్నారు. సారవంతమైన రెండు పంటలు పండే భూములను తీసుకోవడం వల్ల రైతులు తమ జీవనాధారం కోల్పోయే పరిస్థితి దాపురించింది.
గ్రామంలో లేని సర్వేనంబర్లతో నోటిఫికేషన్లు..
మామిడ్గి గ్రామంలో రైతుల నుంచి ఎలాంటి అభిప్రాయ సేకరణ చేయకుండా, గ్రామ సభలు నిర్వహించకుండానే భూ సేకరణకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. అంతే కాకుండా రైతులను అయోమయానికి గురిచేస్తూ గ్రామంలో లేని సర్వేనంబర్లను సృష్టించి భూములు సేకరిస్తున్నట్టు అధికారులు గ్రామంలో నోటిఫికేషన్లు వేస్తున్నారు. రైతుల అభిప్రాయం తీసుకోకుండా భూములు లాక్కుంటున్నారు. ఇవ్వబోమని చెబితే రైతులపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడమే కాకుండా భయాబ్రాంతులకు గురిచేస్తున్నారు. మార్కెట్ ధరకు కాకుండా తక్కువ ధరకు రైతుల నుంచి భూములను గుంజుకుంటున్నారు. అంతేకాక రైతుల దొంగ సంతకాలు పెట్టి భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. మామిడ్గి గ్రామంలో 800 బోర్లు ఉన్నాయి. ఆ బోర్ల కింద 30వేల టన్నుల చెరుకు పంట పండుతుంది. మూడు డైయిరీ ఫామ్స్ ఉన్నాయి. ప్రతి రోజు నాలుగు వేల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. పాడి పంటలు, పాడి పరిశ్రమ విస్తరించిన ప్రాంతంలో రైతులు జీవనాధారంగా ఉన్న సారవంతమైన భూములను తీసుకోవడం మానుకోవాలని పలువురు కోరుతున్నారు. పంటలు పండే భూముల్ని నిమ్జ్‌కు తీసుకోవద్దని రైతులు వేడుకుంటున్నారు.
రైతుల గొంతునొక్కుతున్న ప్రభుత్వం మామిడ్గి రైతు రాజిరెడ్డి
ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన భూ వాల్యూయేషన్ రూ.4.50లక్షలుగా నిర్దారించారు. కానీ నిమ్జ్ కోసం భూములు తీసుకుంటూ ఎకరాకు కేవలం రూ.15లక్షలు మాత్రమే ఇస్తామని ప్రకటించారు. చట్ట ప్రకారం రైతులకు రావలసినవి ఏవి రావడం లేదు. భూ సేకరణ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉంది. నోటిఫికేషన్‌లో వెయ్యి ఎకరాలకు ఇవ్వగా జనరల్ అవార్డు కింద 600 ఎకరాలుగా పేర్కొన్నారు. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. గతంలో తీసుకున్న భూములకు కూడా పరిహారం సైతం ఇవ్వలేదు. ఎలాంటి అభిప్రాయం తీసుకోకుండానే నిమ్జ్‌లో కలిపేసుకున్నారు. భూములు తీసుకోవద్దని 10 -12 ఏండ్ల నుంచి అధికారులకు వినతిపత్రాలు సమర్పించాం. అందరి కాళ్లు మొక్కుతున్నా కనికరం చూపడం లేదు. పంటలు పండే భూములు తీసుకోవద్దు.
బలవంతపు భూ సేకరణ ఆపాలి
బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారు. లేని సర్వేనంబర్లతో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. మార్కెట్ ధరకు కాకుండా తక్కువ ధరకు రైతుల నుంచి భూములు గుంజుకుంటున్నారు. భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో పాటు పోలీసు కేసులు నమోదు చేస్తున్నారు. గ్రామంలో లేని సర్వేనంబర్లు సృష్టించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. తక్కువ పరిహారంతో ఎక్కువ ధర కలిగిన భూములను గుంజుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దొంగ సంతకాలు పెట్టి భూములను బలవంతంగా గుంచుకుంటున్నారు.
-మామిడ్గి గ్రామ రైతు, నాగన్న



