దీపావళి అంటే ఇళ్లను దీపాలతో అలంకరించుకోవడం, కొత్త దుస్తులు ధరించడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపడం మాత్రమే కాదు.. రుచికరమైన వంటకాలతో విందు చేసుకోవడం కూడా. ముఖ్యంగా పండుగ రోజున ఇంటికి బంధువులు, అతిథులు వస్తుంటే వారికి ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేయాలని చాలామంది అనుకుంటారు. మరీ ముఖ్యంగా దీపావళికి నోరు తీపి చేసుకోవడం సంప్రదాయంగా వస్తుంది. అయితే ప్రతిసారీ ఒకే రకమైన స్వీట్ కాకుండా ఇంట్లోనే రకరకాల స్వీట్లు తయారు చేసుకోవచ్చు. ఈసారి ఈ వెరైటీగా స్వీట్లు సిద్ధం చేయండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
సాబుదానా, బియ్యంతో ఖీర్
కావాల్సిన పదార్థాలు: బియ్యం - గ్లాసు, సాబుదానా - గ్లాసు, బెల్లం పొడి - గ్లాసు(తీపి ఎక్కువ కావాలంటే ఇంకొంచం బెల్లం వేసుకోవచ్చు), నెయ్యి - ఆరు చెంచాలు, ఏలకుల పొడి - అర స్పూన్, (పచ్చ కర్పూరం ఇష్టమైతే), జీడిపప్పు, కిస్మిస్ - పది చొప్పున.
తయారు చేయు విధానం: సాబుదానా, బియ్యం రెండింటిని కలిపి శుభ్రంగా కడిగి, మూడు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి, మూడు విజిల్స్ రానివ్వాలి. ఈ లోపు ఒక మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో బెల్లం పొడి వేసి, ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఉడికిన బియ్యం, సాబుదానాని కుక్కర్లోంచి తీసి ఒక సారి బాగా కలుపుకుని ఇప్పుడు దాంట్లో కరిగించిన బెల్లం నీటిని వడకడుతూ పోయాలి. స్టవ్ సింలో పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ లోపు వేరే స్టవ్ మీద మందపాటి బాండీ పెట్టి నాలుగు స్పూన్ల నెయ్యి వేసి వేడిచెయ్యాలి. అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి దోర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని ఉడుకుతున్న అన్నంలో వేయాలి. దించే ముందు ఏలకుల పొడి, ఇష్టమైతే పచ్చ కర్పూరం వేయాలి. పైనుండి ఒక రెండు చెంచాల నెయ్యి వేసి దింపుకోవాలి. ఇది వేడిగా లేదా చల్లారిన తర్వాత తిన్నా చాలా రుచిగా ఉంటుంది.
గోధుమ రవ్వ కేసరి
కావాల్సిన పదార్థాలు: సన్నని గోధుమ రవ్వ - గ్లాసు(దేనితో నైనా కొలవవచ్చు) పంచదార - గ్లాసు (గోధుమరవ్వ తీసుకున్న గ్లాసుతోనే), నెయ్యి - అరగ్లాసు, జీడిపప్పు - పది, కిస్మిస్ - పది, ఏలకుల పొడి - అర చెంచా.
తయారు చేయు విధానం: ఒక మందపాటి బాండీలో పావు గ్లాస్‌కి పైగా నెయ్యి వేసి వేడిచెయ్యాలి. తర్వాత అందులో గోధుమ రవ్వను వేసి సన్నని సెగ మీద వేయించాలి. తిప్పుతూ ఉండాలి లేకపోతే రవ్వ మాడిపోతుంది. ఐదు నిమిషాలు వేయించిన తర్వాత కమ్మని వాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆపేయాలి. మరొక గిన్నె తీసుకుని దాంట్లో రెండు గ్లాసుల నీరు పోసి మరుగుతున్నప్పుడు వేయించిన రవ్వ పోయాలి. కొంచం ఉడికి దగ్గరకి వస్తున్నప్పుడు పంచదార వేసి బాగా కలియబెట్టాలి. పంచదార బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆపేయాలి. దాంట్లోనే ఏలకుల పొడి వేసి మూత పెట్టాలి. చిన్న మూకుడు తీసుకుని దాంట్లో మిగిలిన నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుని చేసి పెట్టుకున్న కేసరిలో వేసి కలపాలి. ఇష్టం ఉన్నవారు నెయ్యి కొంచం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన గోధుమరవ్వ కేసరి రెడీ.
గోధుమ పిండి హల్వా
కావాల్సిన పదార్ధాలు: గోధుమ పిండి - గ్లాసు, బెల్లం పొడి - గ్లాసు, ఏలకుల పొడి - అర చెంచా, నెయ్యి - అర గ్లాసు, ఫుడ్ కలర్ - చిటికెడు. (కొలతలు దేనితోనైన తీసుకోవచ్చు.. గ్లాస్, గిన్నె,)
తయారుచేయు విధానం: ముందుగా ఒక గిన్నెలో బెల్లం వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలి. తర్వాత మందపాటి బాండీ తీసుకుని దాంట్లో నెయ్యి వేసి గోధుమ పిండిని సన్నని సెగ మీద కమ్మని వాసన వచ్చి, పిండి మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని వడకడుతూ గోధుమపిండిలో పోస్తూ కలపాలి. ఉండలు లేకుండా బాగా కలుపుతూ మొత్తం దగ్గర పడే వరకు కలపాలి. పై నుండీ ఫుడ్ కలర్‌ని కొంచం నీళ్ళల్లో కలిపి పోయాలి. కలుపుతూ ఉంటే మొత్తం బాగా కలిసి హల్వా లాగా అవుతుంది. దాంట్లో ఏలకుల పొడి వేసి మరొక్కసారి బాగా కలియపెట్టాలి. ఇష్టం ఉన్నవాళ్లు బాదం పప్పులు చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. కమ్మని గోధుమ పిండి హల్వా మీ ముందు ఉంటుంది.
పెసరపప్పుతో హల్వా
కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు - గ్లాసు, పచ్చికొబ్బరి పావు గ్లాసు, బొంబాయి రవ్వ - పావు గ్లాసు, నెయ్యి - 150 గ్రాములు, నూనె - 50 గ్రాములు, యాలకుల పొడి - చెంచా, జీడిపప్పు, కిస్మిస్ - రెండు కలిపి 25.
తయారు చేయు విధానం: ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత పప్పు గుత్తితో మరీ మెత్తగా కాకుండా మెదుపుకోవాలి. వేరే బాండీ తీసుకొని దానిలో నెయ్యి వేసి కొంచెం వేడెక్కిన తర్వాత నూనె కూడా వేసి దానిలో బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుము వేసి కొంచెం గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మెత్తగా చేసి పెట్టుకున్న పెసరపప్పుని అందులో వేసి బాగా కలియబెట్టాలి. దాంట్లోనే ఏలకుల పొడి కూడా వేసి, కనీసం పది నిమిషాల వరకు కలుపుతూ ఉంటే పచ్చివాసన అంతా పోయి బాండీ నుంచి పప్పు విడి పడుతూ ఉంటుంది. ఆ తర్వాత వేరే గిన్నెలో మరి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేయించి ఉడికించిన దానిలో వేయాలి. దీన్ని తయారు చేసుకోవడం చాలా తేలిక. పెసరపప్పుని గంట ముందు నానబెట్టి కడిగి, వేయించి రవ్వాలగా చేసి కూడా చేసుకోవచ్చు. అయితే దీనికి కొంచం సమయం ఎక్కువ పడుతుంది.
- పాలపర్తి సంధ్యారాణి







కామెంట్లు (0)