చలికాలంలో పెద్దగా దాహం వేయడం లేదని నీళ్లు తాగడం మానేస్తారు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. శ్వాసనాళాల లోపలి పొరపై ఉండే శ్లేష్మం తగినంత తేమతో ఉండేలా సహాయపడుతుంది. ఈ శ్లేష్మం గాలితోపాటు లోపలికి వచ్చే ధూళి, అలర్జీ కారకాలు, ఇతర హానికర కణాలను అడ్డుకుంటుంది. ఈ సమయంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల తగినంత నీరు తీసుకోవాలి.
శ్వాసనాళాల్లో ఉండే శ్లేష్మం కేవలం దగ్గు, జలుబు సమయంలో ఏర్పడే పదార్థం మాత్రమే కాదు. ఇది శరీరానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. గాలితో లోపలికి వచ్చే ధూళి, సూక్ష్మజీవులు, కాలుష్య కణాలను పట్టుకుని ఉంచుతుంది.
శ్వాసనాళాల్లో ఉండే వెంట్రుకల్లాంటి సన్నని నిర్మాణాలు ఈ శ్లేష్మాన్ని క్రమంగా గొంతు వైపు కదిలిస్తాయి. అక్కడి నుంచి అది మింగడం లేదా దగ్గడం ద్వారా బయటకు వెళ్తుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే శ్లేష్మం తగినంత పలుచగా, తేమతో ఉండాలి. శరీరంలో నీటి కొరత ఏర్పడితే అది చిక్కగా మారి బయటకు వెళ్లడం కష్టమవుతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుంది.
చలికాలంలో దాహం అనిపించకున్నా శ్వాస, మూత్ర విసర్జన, చెమట ద్వారా శరీరం నీటిని కోల్పోతుంది. ఈ కాలంలో నీటితోపాటు సూప్‌లు, పులుసులు, పుచ్చకాయ, నారింజ, దోసకాయ, టమాటా వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా తీసుకోవాలి. నిరంతర దగ్గు, ఆయాసం, అధిక కఫం, పిల్లికూతలు వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
తగినంత నీరు తాగాలి..
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)