ప్రియమైన వేణు గీతికకు
నాన్నా ఎలా ఉన్నావు? గర్భ ఆడానని చెప్పావు, చాలా సంతోషం. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకుని, వీలైతే సరదాగా నలుగురితో కలిసి గడపటం చాలా మంచిదే. సరే నాన్నా, నీకు చెప్పాను కదా ఒక కథ చదివాను, నేరాలు ఇలా కూడా జరుగుతాయా అనిపించిందనీ.. అదే ఈ ఉత్తరంలో రాస్తున్నాను.
మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనతో పాటు తోటి ప్రయాణికులు ఉంటారు. రైలు, బస్ ఆగినప్పుడు వారు వారి సామాన్లను చూస్తూ ఉండమని, ఇప్పుడే వస్తామని అడుగుతారు. వాళ్ల మాటలు అనుమానస్పదంగా అనిపిస్తే నేను కిందకు దిగుతున్నాను, నేనే ఎవరికైనా చెప్పాలనో, ఎక్కడకు పోవులేండి అనో చెప్పాలి. అది బస్లో మాత్రమే సాధ్యం. రైలు ప్రయాణంలో అలా చెప్పినప్పుడు ఇంకెవరికైనా చెప్పండి అనో, అనుమానాస్పదంగా అనిపిస్తే క్షమించండి అని చెప్తే వాళ్ళు వేరే ఎవరికైనా చెప్పుకుంటారు. ఇంతలా చెప్పడానికి కారణం ఒక కథ చదివాను అని చెప్పాను కదా. ఒకతను బాగా ధనవంతుడులాగా ఖరీదైన సూటు, బూటు వేసుకొని చేతిలో ఓ ఖరీదైన బ్రీఫ్కేస్ పట్టుకుని ఫస్ట్ క్లాస్ బోగీలో ఎక్కుతాడు. ఫోనులో లక్షల్లో, కోట్లల్లో మాట్లాడుతూ ఉంటాడు. తోటి ప్రయాణికుడు అబ్బా ఎంత కోటీశ్వరుడో అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఫోన్ మాట్లాడటం అయ్యాక పక్కవారితో మాటలు కలుపుతూ,
చిన్న నాటి విషయాలు ఏవో చెప్తూ ఎంతో కాలం తర్వాత కలిసాము అని, ఎవరెవరి పేర్లు చెప్పి అందరి గురించి అడుగుతూ ఉంటాడు. తోటి ప్రయాణికుడు ఏమనుకుంటాడంటే నాకు తెలిసిన పేర్లు కొన్ని ఉన్నాయి, నేనే ఇతని గురించి మర్చిపోయి ఉండవచ్చు అని వాళ్ల గురించి గుర్తు ఉన్నవి చెప్తాడు
కబుర్లు చెబుతూ ప్రయాణం మధ్యలో ఒకతన్ని ఫలానా స్టేషన్లో కలవమని అతనికి ముప్పై వేలు ఇస్తానని అంటాడు. తీరా స్టేషన్ వచ్చే సమయానికి బ్రేఫ్ కేస్ తెరుచుకోలేదు. టెన్షన్ పడుతూ తోటి ప్రయాణికుడి వైపు చూడగా చిన్న అమౌంట్ కదా నేను ఇస్తాను, మీరు ఇవ్వాల్సినవి అతనికి ఇచ్చేసి రండి అని, ముప్పై వేలు తీసి ఇస్తాడు. అవి పట్టుకుని రైలు దిగి వెళ్ళిపోతాడు. ఇక తిరిగి రాడు. ఇతనేమో మనసులో రాక పోయిన ఫర్వాలేదు, బ్రీఫ్ కేస్ ఇక్కడే ఉంది కదా, పోయింది ముప్పైవేలే కదా, ఇందులో లక్షల్లో డబ్బు ఉందని ఆనందపడతాడు. ఈ లోపు పోలీసులు వచ్చి అదిగో అదే బ్రీఫ్ కేస్ ఇతనే దొంగతనం చేసాడు అంటూ అరెస్ట్ చేస్తారు. అతను ఎంత వేడుకున్నా ఫలితం సూన్యం. ఇది చదివాక అనిపించింది అపరిచితులతో, ముఖ్యంగా ఇలా ఎవరైనా అనుమానస్ప దంగా మాటలు కలిపినప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఉంటాను నాన్నా.
ప్రేమతో అమ్మ పాలపర్తి సంధ్యారాణి







కామెంట్లు (0)