న్యాయం కోసం పోరాడిన మహిళకు న్యాయస్థానమే కన్నీళ్లు మిగిలిస్తే.. సమాజం ఎటువైపు పయనిస్తోంది? ఆమె అప్పుడు ఐదు నెలల గర్భిణి. కండ్లముందే తన మూడేండ్ల పసిపాపను చంపేశారు. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశారు. అయినా బతికింది. న్యాయం కోసం పోరాడింది. నిందితులకు శిక్ష పడే వరకు పోరాడాతూనే ఉంది. అలాంటి ఆమె నేడు రక్షణ కోసం పరుగులు తీస్తుంది. ఆమే బిల్కిస్ బానో..
ఒకవైపు నేరస్తులకు శిక్ష పడాలని పోరాడుతున్న మహిళ. మరోవైపు న్యాయం కోసం ఆమె సాగించిన పోరాటానికి అండగా నిలవాల్సిన వ్యవస్థలు. ఈ రెండింటి మధ్య సాగిన సుదీర్ఘ పోరాటంలో బిల్కిస్ బానో ఎదుర్కొన్నది కేవలం నేరస్థుల క్రూరత్వాన్ని మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను ఆశ్రయించిన బాధితురాలిగా మళ్లీ మళ్లీ మానసిక వేదనను కూడా. 2026 అక్టోబర్ 28న ఇద్దరు దోషుల జీవితఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేసి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 16న ఆ ఉత్తర్వులు వెలుగులోకి రావడంతో మరోసారి దేశవ్యాప్తంగా బిల్కిస్ బానోకు జరిగిన అన్యాయం తీవ్ర చర్చకు దారితీసింది. 2024లో ఇదే కేసులో 11 మంది దోషులకు ఇచ్చిన శిక్షా మినహాయింపును రద్దుచేసిన సుప్రీంకోర్టు, ఇప్పుడు వారిలో ఇద్దరికి బెయిల్ ఇవ్వడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది కేవలం ఒక న్యాయపరమైన ఉత్తర్వు గురించి చర్చ కాదు. ఇది మహిళా గౌరవం గురించి, బాధితురాలి హక్కుల గురించి, న్యాయవ్యవస్థపై ప్రజలకుండాల్సిన విశ్వాసం గురించి, భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వం, జీవించే హక్కుల గురించి మాట్లాడాల్సిన సందర్భం.
చీకటి అధ్యాయం
2002లో గుజరాత్లో జరిగిన మతకలహాల సమయంలో బిల్కిస్ బానో కుటుంబం ప్రాణభయంతో తమ స్వస్థలాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేసింది. అప్పుడు ఆమెకు 21 ఏండ్లు. ఐదు నెలల గర్భిణి. ఆ భయానక పరిస్థితుల్లో ఒక మూక ఆమె కుటుంబంపై దాడి చేసింది. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడింది. ఆమె మూడేండ్ల కుమార్తెతో సహా కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసింది. ఏ మనిషైనా జీవితంలో ఇంతటి విషాదాన్ని భరించడం సాధ్యమా? కానీ బిల్కిస్ బానో బతకడమే కాదు పోరాడింది. ఈ కేసు విచారణలో న్యాయం జరగదనే భయాలు, సాక్షులకు ఎదురైన బెదిరింపులు, దర్యాప్తుపై వచ్చిన సందేహాల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యంతో కేసు విచారణ గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ అయింది. 2008లో ముంబై ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం 11 మందిని దోషులుగా నిర్ధారించి జీవితఖైదు విధించింది. 2017లో బాంబే హైకోర్టు ఆ శిక్షలను సమర్థించింది.
పూలమాలలతో స్వాగతం...
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బిల్కిస్ బానో తనకు జరిగిన అన్యాయాన్ని మౌనంగా భరించి ఉంటే ఈ కేసు పోరాటానికి ప్రతీకగా నిలిచేది కాదు. ఆమె ధైర్యం ఎంతో మంది మహిళలకు పోరాట స్ఫూర్తినిచ్చింది. అయితే 2022 ఆగస్టు 15న దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో గుజరాత్ ప్రభుత్వం ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులకు శిక్షా మినహాయింపు ఇచ్చి విడుదల చేసింది. వారికి పూలమాలతో స్వాగతం పలికిన దృశ్యాలు దేశాన్ని కలచివేశాయి. బిల్కిస్ బానో పోరాటంతో 2024 జనవరి 8న సుప్రీంకోర్టు ఈ శిక్షా మినహాయింపును రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి ఆ మినహాయింపు ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. దోషులు తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ఇది న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఆశలు కలిగించిన తీర్పు.
మళ్లీ తెరపైకి వచ్చింది
2026 అక్టోబర్ 28న సుప్రీంకోర్టు ఇద్దరు దోషులకు జీవితఖైదును తాత్కాలికంగా నిలిపివేసి బెయిల్ మంజూరు చేసింది. వీరు 17 ఏండ్లకు పైగా జైల్లో ఉన్నారని, వారిలో ఒకరికి తీవ్రమైన వైకల్యం ఉందని, అప్పీలులో పరిశీలించాల్సిన న్యాయపరమైన, వాస్తవపరమైన అంశాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. అయితే ఇంతటి తీవ్రమైన నేరంలో బాధితురాలిగా ఉన్న బిల్కిస్ బానోకు ఈ నిర్ణయం గురించి ముందుగా సమాచారం అందిందా? ఆమె వాదనలు వినిపించే అవకాశం కల్పించారా? ఈ ఉత్తర్వు గురించి పత్రికా కథనాల ద్వారానే తెలుసుకున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారామె. ఈ ఉత్తర్వును సవాలు చేస్తానని ప్రకటించారు. ఒక బాధితురాలు తన జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన నేరంపై న్యాయం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నప్పుడు, తనను ప్రభావితం చేసే న్యాయప్రక్రియలో తన స్వరం వినిపించే అవకాశం ఉందా లేదా అన్నది అత్యంత కీలకమైన ప్రశ్న.
అంతులేని మానసిక వేదన
బిల్కిస్ బానో వ్యక్తం చేసిన ఆవేదనను సాధారణ అసంతృప్తిగా చూడలేం. ఆమెపై జరిగిన దాడి కేవలం ఆమె శరీరాన్ని మాత్రమే గాయపరచలేదు. ఆమె కుటుంబాన్ని, మాతృత్వాన్ని, మానవత్వంపై ఉన్న నమ్మకాన్ని, భవిష్యత్తుపై ఉన్న ఆశలను ఛిన్నాభిన్నం చేసింది. అంతటి విషాదం తర్వాత కూడా ఆమె న్యాయం కోసం నిలబడింది. తనకు జరిగిన అన్యాయాన్ని నిరూపించుకోవడానికి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంది. ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత నిందితులకు శిక్ష పడింది. 2022లో వారిని విడుదల చేయడంతో ఆమెకు మళ్లీ గాయం తగిలింది. 2024లో సుప్రీంకోర్టు ఆ విడుదలను రద్దు చేయడంతో తిరిగి న్యాయంపై ఆశ కలిగింది. ఇప్పుడు మరో ఇద్దరికి బెయిల్ రావడంతో ఆ పాత భయాలు తిరిగి వచ్చాయని ఆమె చెబుతున్నారు. తన పిల్లల భవిష్యత్తు, వారి భద్రత, న్యాయవ్యవస్థపై తనకున్న విశ్వాసం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య విలువలపై దాడి
బిల్కిస్ బానో కేసులో మరో ముఖ్యమైన సామాజిక కోణం ఉంది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో జరిగిన ఈ నేరం మతకలహాల హింస ఎంతటి దారుణాలకు దారితీయగలదో చూపించింది. ఒక మహిళ శరీరాన్ని మత విద్వేషానికి ఆయుధంగా మార్చడం, ఒక కుటుంబాన్ని మతపరమైన గుర్తింపు ఆధారంగా లక్ష్యంగా చేసుకోవడం నాగరిక సమాజం అంగీకరించకూడని విషయం. మహిళ ఎవరు? ఆమె ఏ మతానికి చెందినది? ఏ కులానికి చెందినది? ఏ ప్రాంతానికి చెందినది? ఏ రాజకీయ భావజాలం కలిగి ఉంది? ఇవేవీ ఆమెకు లభించాల్సిన గౌరవాన్ని, భద్రతను నిర్ణయించకూడదు. మహిళపై ఏ మతానికి చెందిన వ్యక్తి దాడి చేసినా నేరమే. మతం కన్నా మానవత్వం గొప్పదని, అధికారం కన్నా రాజ్యాంగం గొప్పదని, వ్యక్తుల పట్ల విధేయత కన్నా న్యాయసూత్రాల పట్ల నిబద్ధత గొప్పదని సమాజం గుర్తించాలి.
మౌనంగా ఉండకూడని సందర్భం
బిల్కిస్ బానో పోరాటం మహిళా ఉద్యమాలకు ఒక ముఖ్యమైన పాఠం. బాధితురాలికి న్యాయం జరిగే వరకు, ఆమె గౌరవం, భద్రత, హక్కులు పరిరక్షించబడే వరకు సమాజాన్ని చైతన్యపరచడం అందరి బాధ్యతే. బిల్కిస్ బానోకు న్యాయం కావాలని కోరడం అంటే కేవలం ఆమెకు మద్దతు ఇవ్వడం కాదు. రేపు ఏ మహిళకైనా ఇలాంటి అన్యాయం జరిగితే ఆమెకు కూడా న్యాయం అందాలనే ప్రజాస్వామిక హక్కును కాపాడటం. మహిళల భద్రత అనేది ఇంటి గడప దగ్గర మొదలై సమాజంలో, పోలీస్ స్టేషన్లో, న్యాయస్థానంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిచోటా కొనసాగాలి. చట్టాలు ఉండటం మాత్రమే సరిపోదు. వాటిని అమలు చేసే వ్యవస్థల్లో మానవీయ దృక్పథం, రాజ్యాంగ విలువలు, బాధ్యత ఉండాలి. బిల్కిస్ బానో పోరాటం ఆగకూడదు. ఆమెకు న్యాయం జరగాలి. ఆమెకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదు. ఎందుకంటే.. ఒక మహిళ కన్నీటిని తుడవలేని న్యాయం సంపూర్ణ న్యాయం కాదు. ఒక మహిళ భయంలేకుండా బతకలేని స్వాతంత్ర్యం సంపూర్ణ స్వాతంత్ర్యం కాదు. మహిళల గౌరవాన్ని కాపాడలేని సమాజం నాగరిక సమాజం కాదు. బిల్కిస్ బానోకు న్యాయం కావాలి. ప్రతి మహిళకు భద్రత కావాలి. రాజ్యాంగ విలువలు నిలవాలి.
లేవనెత్తుతున్న ప్రశ్నలు
ఈ కేసును ఒక వ్యక్తి కేసుగా మాత్రమే చూడకూడదు. భారతదేశంలోని మహిళలందరి భద్రత, గౌరవం, సమానత్వంతో దీనికి సంబంధం ఉంది. మహిళలను గౌరవించాలని, ఆడపిల్లలను రక్షించాలని, మహిళా సాధికారత సాధించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ మహిళలపై అత్యంత క్రూరమైన నేరాలు జరిగినప్పుడు న్యాయప్రక్రియలో వారి భద్రత, గౌరవం, న్యాయం పట్ల నమ్మకం కూడా అంతే ముఖ్యమైనవి. శిక్షలు విధించడం ఒక అంశం. ఆ శిక్షలు అమలులో ఉండేలా చూడడం, అప్పీల్ ప్రక్రియలో బాధితురాలి హక్కులను కాపాడడం మరో ముఖ్యమైన అంశం. ఒక మహిళ తనపై జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడినపుడు తనకు న్యాయం లభిస్తుందనే నమ్మకం ఉండాలి. కానీ సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా ప్రతి కొత్త పరిణామం ఆమెను మళ్లీ భయాందోళనలకు గురిచేస్తే, ఇతర బాధిత మహిళలు ముందుకు రావడానికి వెనుకాడే ప్రమాదం ఉంది.
- పూర్ణిమా యర్రంశెట్టి, 9676439996







కామెంట్లు (0)