ఒకప్పుడు భోజన సమయం అంటే కుటుంబ సభ్యులు మొత్తం ఒక దగ్గర కూర్చోని మాట్లాడుకుంటూ తినేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఫోన్లు, టీవీలు ఆక్రమించాయి. ఖాళీగా కూర్చున్నప్పుడే కాదు, తినే సమయంలో కూడా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. చిన్న పిల్లలు కార్టూన్లు చూస్తే, పెద్దలు కూడా సోషల్ మీడియాతో గడుపుతూ భోజనం చేస్తుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై పలు రకాలుగా ప్రభావం చూపుతుందని, ఆరోగ్య సమస్యలు సైతం వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం...
భోజనం చేసేటప్పుడు మనసు ఆహారంపై ఉండటం చాలా ముఖ్యమంటున్నారు. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే విషయాలను గమనించాలి. మొబైల్ చూస్తూ తినడం వల్ల ఆహారంపై ఏకాగ్రత తగ్గుతుందని, కడుపు నిండిన సంకేతాలను మెదడు సరిగ్గా గుర్తించకపోవచ్చు. దీనివల్ల అవసరానికి మించి తినే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చూస్తూ తిన్నవారు, ఎలాంటి దృష్టి మళ్లింపు లేకుండా తిన్నవారితో పోలిస్తే ఎక్కువ కేలరీలు తీసుకున్నట్లు పలు అధ్యయనాల్లో సైతం గుర్తించారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి కారణమవుతుంది.
త్వరత్వరగా తింటుంటారు
చిన్నారులకు అన్నం తినిపించేటప్పుడు మొబైల్ చూపిస్తుంటారు. కానీ ఇది చాలా తప్పంటున్నారు వైద్యులు. కార్టూన్లు చూస్తూ తింటున్నప్పుడు పిల్లలు కడుపు నిండిందనే విషయాన్ని గుర్తించే అవకాశం చాలా తక్కువ. దీంతో ఎంత పెడితే అంత తినే అవకాశం ఉందని, ఫలితంగా ఊబకాయం బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే తినే ఆహారాన్ని సరిగ్గా నమలడం జీర్ణక్రియకు అవసరం. తెరపై దృష్టి పెట్టినప్పుడు కొందరు ఆహారాన్ని నమలకుండా త్వరత్వరగా తింటుంటారు. దీని వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆహారంలోని రుచి, వాసన, రంగు, ఆకృతిని ఆస్వాదించే అవకాశం కూడా తగ్గుతుందని, ఫలితంగా భోజనంపై తృప్తి ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. పిల్లలు ఆహారాన్ని తాకడం, దాని రంగు, రుచి, వాసన, ఆకృతిని తెలుసుకోవడం కూడా వారి ఎదుగుదలలో భాగమే అంటున్నారు నిపుణులు. అయితే భోజన సమయంలో డిజిటల్ తెరలకు అలవాటు పడితే ఆహారంపై సహజ ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. సొంతంగా తినడం నేర్చుకునే ప్రక్రియకూ ఆటంకం కలుగుతుంది. ఈ అలవాటు క్రమక్రమంగా ఫోన్ వదిలి వెళ్లలేని పరిస్థితికి తీసుకువెళ్లే ప్రమాదానికి దారి తీస్తుంది.
పరిశోధనలు
2025లో ప్రచురితమైన ఒక సమీక్షలో స్మార్ట్‌పోన్ చూస్తూ చిరుతుండి తిన్న పెద్దలు సగటున 591 కేలరీలు, ఎలాంటి దృష్టి మళ్లింపు లేకుండా తిన్నవారు 535 కేలరీలు తీసుకున్నారని, అంటే దాదాపు 10 శాతం ఎక్కువ అని పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే ఇది ఒక నిర్దిష్ట ప్రయోగంలో నమోదైన ఫలితం మాత్రమే అంటున్నారు. అలాగే 2026లో ప్రచురితమైన 50 అధ్యయనాల సమీక్షలోనూ దృష్టి మళ్లింపుతో భోజనం చేసే సమయంలో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పిల్లలల్లో టీవీ చూస్తూ తినే అలవాటుకు అనారోగ్యకరమైన ఆహార ఎంపికలకు మధ్య సంబంధం ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు సూచించాయని వివరిస్తున్నారు. అయితే భోజన సమయంలో ఫోన్ వాడకం వల్ల నేరుగా మధుమేహం వస్తుందని నిర్ధారించే ఆధారాలు ఇంకా స్పష్టంగా లేవంటున్నారు. భోజనం చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టడం చిన్న మార్పే కావచ్చు. కానీ అది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధానికి మంచి ఆరంభం అవుతుంది. రోజంతా జరిగిన విషయాలను పంచుకోవడం, పిల్లల అనుభవాలను తెలుసుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి ఈ సమయంలో సాధ్యమవుతాయి. కానీ అందరూ ఫోన్లలో మునిగిపోతే ఆ అవకాశం కోల్పోతారు.
ఈ మార్పులు చేసుకోవాలి
రోజులో కనీసం ఒక పూట కుటుంబ సభ్యులంతా ఫోన్లకు దూరంగా కూర్చుని భోజనం చేయాలని సూచిస్తున్నారు. తినే సమయంలో టీవీలు, ఫోన్లకు దూరంగా ఉండాలి..
పిల్లలకు ఆహారం పెడుతున్నప్పుడు కార్టున్లు చూపించకుండా వారితో మాట్లాడుతూ తినిపించాలని చెబుతున్నారు.
చిన్నారులకు ఒకేసారి ఎక్కువ మొత్తం కాకుండా కొద్దికొద్దిగా ఆహారం పెడుతూ, మరింత కావాలంటే అడిగే అవకాశం ఇవ్వాలి.
పిల్లలు తినడానికి నిరాకరిస్తే బలవంతం చేయకుండా కాసేపు విరామం ఇవ్వాలంటున్నారు.
ఆహారంలో రుచి, వాసన, రంగు, ఆకృతిని పిల్లలకు పరిచయం చేయాలి.







కామెంట్‌లు (0)