Magazines

హింసలేని సమాజం సృష్టిద్దాం

32 నిమిషాల క్రితం

violence
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 3 నిమిషాల చదవడం

మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినం.. ప్రతి ఏడాది నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మహిళలు, బాలికలపై రోజురోజుకు పెరుగుతున్న దాడులు, హింసపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. కాలం ఎంత మారుతున్నా, మహిళలు అన్ని రంగాలలో విజయం సాధిస్తున్నా స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు కొనసాగుతునే ఉన్నాయి. మహిళలపై హింస అనేది మానవ హక్కుల ఉల్లంఘనగా భావించనంత కాలం ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మహిళలపై హింస అనేది ప్రపంచ మహమ్మారిగా కొనసాగుతోంది. దీనికి నివారణలు అవసరం. హింస లేని ప్రపంచాన్ని సృష్టించడం కూడా అంతే అవసరం. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారని ఐరాస చెబుతోంది. మహిళలు ఒకవైపు అంతరిక్ష పరిశోధనల నుండి కార్పొరేట్ నాయకత్వం వరకు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. మరోవైపు సామాజిక, ఆర్థిక సవాళ్లను, ముఖ్యంగా హింసను ఎదుర్కొంటున్నారు.


1960లో డొమైన్ రిపబ్లిక్‌లో రాజకీయ కార్యకర్తలైన మిరాబల్ సిస్టర్స్ హత్య రోజును స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటించడం ప్రారంభమైంది. ఈ హత్యలు డొమైన్ రిపబ్లిక్ నియంత అయిన రాఫ్హీల్ ట్రుజిల్లో ఆధ్వర్యంలో 1981లో జరిగాయి. ఉద్యమకారులు నవంబరు 25న స్త్రీ హింసా వ్యతిరేకత గురించి అవగాహన కల్పించడానికి నిర్ణయించారు. అలా 1999 డిసెంబరు 17న ఈ రోజును అధికారికంగా ఐక్యరాజ్య సమితి తీర్మానించింది.

హింసా రూపాలు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాలు, సామాజిక అధ్యయనాల ప్రకారం మహిళలపై హింస వివిధ రూపాల్లో కొనసాగుతోంది. మన దేశంలో మహిళలు అత్యంత సాధారణంగా ఎదుర్కొనేది గృహ హింస. వరకట్న వేధింపులు, శారీరక, మానసిక దాడులు ఇప్పటికీ కుటుంబ వ్యవస్థలో లోతుగా వేళ్లూనుకుని ఉన్నాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో, రవాణా వ్యవస్థల్లో అభద్రతా భావం మహిళల స్వేచ్ఛను పరిమితం చేస్తోంది. ఇటీవల కాలంలో సైబర్‌ ‌నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మహిళలు దీనికి ఎక్కువగా బలవుతున్నారు. డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ వేధింపులు, మార్ఫింగ్, సైబర్ స్టాకింగ్, డీప్‌ఫేక్ వంటి కొత్త తరహా హింస తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అలాగే అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది మహిళలకు సరైన భద్రత, సమాన వేతనం అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మగపిల్లల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానం వల్ల లింగ నిష్పత్తిలో అసమానతలు, బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి.

తగిన సమాధానం చెప్పే ధైర్యం

కరోనా సమయంలో కూడా మనం చూశాము. బాలికలు, మహిళలపై ఎక్కువగా దాడులు పెరిగాయి. అదే సమయంలో గృహహింస తారాస్థాయిలో జరిగింది. దీనికి సంబంధించిన లెక్కలు కూడా లేవు. ఆ సమయంలో చాలామంది స్త్రీలు బయటకు వచ్చి వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి చెప్పే వీలు కూడా లేకపోయింది. ఆ తర్వాత కూడా స్త్రీ తనకు జరిగిన అన్యాయం మీద ఎటువంటి రిపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీని వెనుక అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కుటుంబ పరువు, ప్రతిష్టలు, సమాజంలో చెడ్డ పేరు వస్తుందనే భయం, పిల్లల భవిష్యత్ లాంటివి అడ్డు వస్తాయి. వీటిని లెక్కచేయక ముందుకు అడుగు వేసినాడు మాత్రమే స్త్రీ తనకు జరిగిన అన్యాయానికి న్యాయం పొందగలుగుతుంది. దీనికి బాధ్యులైన వారికి తగిన శిక్షపడేలా చేయగలదు. యువతలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం కూడా వారిలో ధైర్యాన్ని నింపుతాయి. ఎటువంటి సమస్య వచ్చినా వారికి వారుగా పరిష్కరించుకునే తెగింపును సాధించగలుగుతారు. ఆత్మాభిమానానికి ఇబ్బంది కలిగితే వారిలో వారు బాధపడకుండా దానికి పరిష్కారం చురుగ్గా తీసుకోగలగాలి. అప్పుడే స్త్రీ అణిచివేత తగ్గుముఖం పడుతుంది. ఈ మధ్యకాలంలో మరో సమస్య ప్రతి స్త్రీనీ వేధిస్తుంది. అదే బాడీ షేమింగ్ దీనికి ప్రధాన కారణం శరీర ఆకృతి గురించి రకరకాలుగా మాట్లాడటం, కించపరచడం అనేది ఎక్కువైపోతుంది. చులకన చేసి మాట్లాడటం, సూటిపోటి మాటలతో బాధపెట్టడం వంటివి ఎదురైనప్పుడు వాటిని పట్టించుకోనట్లు ప్రవర్తించకుండా తగిన సమాధానం చెప్పగలిగే ధైర్యం ప్రతి స్త్రీలోనూ ఉండాలి.

పోరాడి సాధించుకున్న చట్టాలు - హక్కులు

భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులను కల్పించడంతో పాటు, హింస నుండి రక్షణకు అనేక కఠిన చట్టాలను రూపొందించింది. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం (2005). కుటుంబ సభ్యుల నుండి ఎదురయ్యే శారీరక, మానసిక, ఆర్థిక హింస నుండి రక్షణ. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH Act, 2013). కార్యాలయాల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం. వరకట్న నిషేధ చట్టం (1961). వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం, వేధించడం నేరంగా పరిగణించడం. భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలు మహిళలపై జరిగే నేరాలకు కఠినమైన శిక్షలు, సత్వర విచారణ ప్రక్రియ. కానీ ఈ చట్టాలన్నీ కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమయాయ్యి. అమలులోని లోపాల వల్ల మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. నిర్భయ, దిశ, హథ్రాస్‌ వంటి చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతుండగానే శ్రద్ధావాకర్‌ ఘటన స్త్రీ మీద జరిగిన మరో అత్యంత ఘోరమైన ఘాతుకం. అలాగే హైదరాబాద్‌‌లో ఓ నర్సుపై హాస్టల్లో జరిగిన దాడి. ఇవి మాత్రమేనా? పసిపిల్లలపై రోజు రోజుకూ జరుగుతున్న అఘాయిత్యాలూ, అత్తింటి ఆరళ్లు, లైంగిక వేధింపులు, ప్రేమ విఫలమైందని అమ్మాయిలపై జరుగుతున్న దాడులు, చావులు, పరువు హత్యలు ఇలా ఒక్కటేమిటి స్త్రీ చుట్టూ లెక్కలేననంత హింస.


- సలీమా

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్