తొమ్మిదిరోజుల పాటు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ జరుపుకున్న తర్వాత మరో రెండు రోజులు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాం. దసరా అంటే బొమ్మల కొలువుకు ప్రత్యేకం. అలాంటి బొమ్మల కొలువును ప్రతి ఏడాది ఒక్కో అంశాన్ని తీసుకొని గత ఇరవై ఏండ్లుగా నిర్విరామంగా నర్విహిస్తున్నారు హైదరాబాద్‌లోని, లాలాపేట్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో ప్రశాంత్ నగర్‌కు చెందిన సుష్మ ప్రియదర్శిని, స్వప్న నాయక్. ప్రతి ఏడాది వారు ఏర్పాటు చేస్తున్న ఈ బొమ్మల కొలువులో మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పురాణగాథల వారసత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు.
నేటి తరం పిల్లలకు మన ప్రాచీన సంప్రదాయాలు, ఇతిహాసాలు, పండుగల విశిష్టత, దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది వీరు ఈ బొమ్మల కొలువును మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కాలక్రమేణా కనుమరుగవుతున్న మన సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడం, వాటి విలువను తెలియజేయడం మా ప్రధాన లక్ష్యం’ అని వారు అంటున్నారు.
ప్రతి ఏడాది ప్రత్యేక ఇతివృత్తంతో
‘ప్రతి ఏడాది ఒక ప్రత్యేకమైన ఇతివృత్తంతో బొమ్మల కొలువును తీర్చిదిద్దడం మా ఆనవాయితీ. ఈ ఏడాది మహారాష్ట్రలోని ప్రసిద్ధ పండరీపురం విఠోబా ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను అందంగా రూపొందించాము. వీటితో పాటు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, సంప్రదాయాలను ప్రతిబింబించే మరెన్నో ప్రత్యేక అలంకరణలను ఏర్పాటు చేశాము. ఈ వేడుకలో మా కుటుంబ సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం మరింత ప్రత్యేకం’ అంటూ వాళ్లు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
సమిష్టి కృషితో
ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకోవడం నుంచి బొమ్మలు అమర్చడం, ఆలయ నమూనాలను రూపొందించడం, ప్రతి చిన్న వివరాన్ని అందంగా తీర్చిదిద్దడం వరకు అందరూ కలిసి పనిచేస్తారు. ఈ ప్రక్రియ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంపొందించడమే కాకుండా, పండుగను ఆనందంగా, ఆత్మీయంగా జరుపుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ‘మా దృష్టిలో బొమ్మల కొలువు అంటే కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదు. మన సంస్కృతికి, సంప్రదాయలకు ప్రతీకలు. తరతరాలను కలిపే వారధి. గత 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం ద్వారా మరిన్ని కుటుంబాలు బొమ్మల కొలువు వైపు ఆకర్షితులై, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఆకాంక్షిస్తున్నాము. మన సంప్రదాయం మన గర్వం మన సంస్కృతి మన వారసత్వం. వాటిని కాపాడటం మన బాధ్యత’ అంటున్నారు.
కుటుంబంతో రండి
కుటుంబ సభ్యులతో కలిసి రండి. మాతో ఆనందాన్ని పంచుకొండి. మా బొమ్మల కొలువును సందర్శించి, ఈ అందమైన సంప్రదాయంలోని కళాత్మకతను, మన సంస్కృతిలోని గొప్పదనాన్ని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాము. మీ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి, ఈ పండుగ ఆనందాన్ని మాతో పంచుకోవాలని సుష్మ ప్రియదర్శిని, స్వప్న నాయక్‌లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రండి మన సంప్రదాయాలను తెలుసుకుందాం, మన సంస్కృతిని చాటిచెబుదాం, భావితరాలకు మన వారసత్వాన్ని అందిద్దాం అని ఆహ్వానిస్తున్నారు.
కనువిందు చేసే బొమ్మల కొలువు
- తలారి. శ్రీనివాసరావు నవ తెలంగాణ, సీనియర్ జర్నలిస్టు







కామెంట్లు (0)