వ్యాపారం.. ఇప్పుడిది చాలామంది కెరీర్‌గా మారిపోయింది. తమ అభిరుచినే వ్యాపారాంశంగా మార్చుకొని సక్సెస్ సాధిస్తోన్న వారెంతోమంది. నాగ్‌పూర్‌కు చెందిన దివ్య ఇదే కోవకు చెందుతారు. ఒక పక్క బ్యాంక్ ఉద్యోగం చేస్తూనే మొక్కల పెంపకం, వ్యవసాయంపై తనకున్న అభిరుచినే వ్యాపార మార్గంగా మలచుకున్నారు. భర్త సహకారంతో, అధునాతన వ్యవసాయ పద్ధతుల్లో తన ఇంట్లోనే కుంకుమపువ్వు సాగు ప్రారంభించారు. ఏడాది తిరిగే సరికి లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు. ఓ ఉద్యోగిగానే కాకుండా ఇప్పుడు ఓ వ్యాపారవేత్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. తాను పాటిస్తోన్న వ్యాపార మెలకువల్నే పాఠాలుగా చెబుతూ ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపుతున్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సిటీకి చెందిన దివ్య ఇంట్లోనే కుంకుమపువ్వు సాగు చేపట్టి విజయవంతమయ్యారు. ప్రారంభ పెట్టుబడి కేవలం రూ.10లక్షలు కాగా నేడు వార్షికాదాయం దాదాపు రూ.40 లక్షలకు చేరింది. ఎంతో వేడిగా ఉండే ఈ నగరంలో శీతల పంటను విజయవంతంగా సాగుచేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. కేవలం నాలుగు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పున్న గదిలో కుంకుమపువ్వు తోటను భర్త సహకారంతో ప్రారంభించిన ఈమె సాగు నేడు 400చదరపు అడుగుల్లో సాగును విస్తరించింది. ప్రారంభంలో ఐదు నెలల్లోనే రూ.8 లక్షల విలువైన దాదాపు రెండు కిలోల కుంకుమపువ్వును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడు నెలల్లోనే అర కిలో ఉత్పత్తి చేశారు. కేవలం ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఏడేండ్ల పాటు దిగుబడి సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ఏటా కనీసం రూ.40లక్షల నికర లాభాన్ని ఖాయం చేసుకున్నారు.
విదర్భ రైతులకు ఆశాకిరణం
దివ్య ఒక బ్యాంకులో అధికారిగా పనిచేస్తుండగా ఆమె భర్త అక్షయ్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తి ఆమెను కుంకుమపువ్వు సాగు ఆలోచన దిశగా అడుగులు వేయించింది. తల్లిదండ్రులు వ్యవసాయ నేపథ్యం కలిగిన వారు కావడంతో ఏదైనా వినూత్నంగా చేయాలని ఆసక్తి పెంచుకున్నారు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌లో కుంకుమపువ్వు సాగు ప్రయోగాల గురించి ఆరా తీశారు. విత్తనాల లభ్యత మొదలుకుని సాగు వివరాల వరకూ సమాచారాన్ని సేకరించి ఇంట్లోనే సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. పూర్తి సమాచారం కోసం కశ్మీర్‌లోని పాంపోర్‌కు కూడా ఆ జంట వెళ్లివచ్చారు. అయితే విదర్భలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి తరచూ ఆటంకంగా మారాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో దివ్య, అక్షయ్ చేపట్టిన కుంకుమపువ్వు సాగు నేడు ఆశాజనకంగా మారింది. ముందుగా ఈ యువదంపతులు నాలుగు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న గదిలో ‘కుంకుమపువ్వు’ సాగు క్షేత్రాన్ని ప్రారంభించారు.
వేడి వాతావరణంలో కుంకుమపువ్వు
సాధారణంగా కుంకుమపువ్వు అతి శీతల ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోనే సాగు చేస్తుంటారు. ఈ పంటను సాగు చేయడానికి వాతావరణం చాలా చల్లగా ఉండాలి. అయితే ‘ఆరెంజ్ సిటీ’గా ప్రసిద్ధి చెందిన అత్యంత వేడి నగరమైన నాగ్‌పూర్‌లో కూడా ఇప్పుడు కుంకుమపువ్వు సాగు సాధ్యమైంది. ‘ఏరోపోనిక్స్’ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఉన్న ఒక్క గదిలోనే వారు కుంకుమపువ్వును విజయవంతంగా ఉత్పత్తి చేశారు.
సాగు ఎలా చేస్తారు?
దివ్య కశ్మీర్‌లోని పాంపోర్ జిల్లా నుంచి కుంకుమపువ్వు విత్తనాలను తీసుకువచ్చారు. ఉల్లిపాయ నారులా కనిపించే ఈ విత్తనాలు చాలా ప్రత్యేకమైనవి. వీటిని నాటిన తర్వాత రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో వాటి నుంచి అనేక నారుమొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఈమె నాటిన మొదటి 100 దుంపలలో 80శాతం వరకు విజయవంతంగా దిగుబడి ఇచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4.73 కిలోల కుంకుమపువ్వును ఉత్పత్తి చేశారు. నాగ్‌పూర్ కేంద్రంగా ‘షాయా ఎంటర్‌ప్రైజెస్’ ద్వారా విక్రయిస్తూ వార్షికాదాయాన్ని రూ.40 లక్షలకు పెంచుకున్నారు. కుంకుమ పువ్వు విత్తన దుంపలను ట్రేలలో పోసిన మట్టి మిశ్రమంలో నాటుకొని పెంచుకోవచ్చు. మట్టి లేకుండా ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కూడా సాగు చేయొచ్చు.
ఏరోపోనిక్స్’ సాంకేతికత అంటే ?
వ్యవసాయం కోసం ‘ఏరోపోనిక్స్’ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇందులో ఒక గదిలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ వ్యవసాయం చేస్తారు. దీనిలో మట్టి గానీ, నీరు గానీ ఉపయోగించరు. తక్కువ సమయంలో లక్షలాది ఉత్పత్తులను ఉత్పత్తి చేయగల ఈ సరికొత్త, విభిన్నమైన ప్రయోగాన్నే ‘ఏరోపోనిక్స్’ సాంకేతికత అంటారు. ఎయిర్ కండిషనర్ ఏర్పాటు చేసి, వాతావరణాన్ని నియంత్రించడానికి హ్యూమిడిఫైయర్‌ను అమర్చారు. మొక్కల వేర్లు గాలిలో వేలాడుతూ ఉండి, సన్నని పొగమంచు ద్వారా పోషకాలను పొందుతాయి. కుంకుమపువ్వు మొక్కలకు అనువైన పరిస్థితులను కల్పించడానికి గది లోపల ఉష్ణోగ్రత, తేమ, లైటింగ్‌ను నియంత్రిస్తారు. విత్తన దుంపలను ట్రేలో పక్క పక్కనే పెడితే సరిపోతుంది. మట్టిలో గాని, నీటిలో గాని వాటిని పెట్టాల్సిన పని లేదు. గాలిలో తేమ 80%తో పాటు చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ తేమతోనే మొక్క పెరిగి, 30–45 రోజుల్లో పూత వస్తుంది. వేరే పోషణ ఏమీ అవసరం లేదు. 7 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉన్న విత్తన దుంపలు వాడితేనే ఆ సీజన్‌లో పూలు వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏరోపోనిక్స్ పద్ధతిలో పెంచే దుంపలను కూడా పూత కాలం పూర్తయిన తర్వాత మట్టి మిశ్రమంలో విధిగా నాటుకోవాల్సిందే.
పంట ఎప్పుడు వస్తుంది?
నవంబర్– డిసెంబర్‌లో మట్టి మిశ్రమంలో నాటుకోవాలని దివ్య అంటున్నారు. వారం/పది రోజులకోసారి నీటిని కొంచెం పిచికారీ చేస్తే సరిపోతుంది. నానో యూరియా లేదా ఎన్‌పికెను నెలకోసారి పిచికారీ చేస్తే చాలు. ప్రతి దుంపకు అనుబంధంగా మూడు, నాలుగు దుంపలు పుట్టుకొస్తాయి. ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు దుంపలు నిద్రావస్థలో ఉంటాయి. ఆ దశలో వాటికి ఆహారం, కాంతి, చల్లని వాతావరణం, గాలిలో 80% తేమ అవసరం లేదు. కుంకుమ పువ్వు దుంపలను జూలైలో మట్టిలో నుంచి తీసి 7 గ్రాములు అంతకన్నా ఎక్కువ బరువు ఉన్న పిల్ల దుంపలను వేరు చేసి, తిరిగి మట్టి మిశ్రమంలో నాటుకొని కుంకుమ పువ్వు సాగు చేయవచ్చు. లేదా విత్తన దుంపలను ట్రేలలో పెట్టుకొని ఏరోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. అప్పటి నుంచి మళ్లీ నిద్రావస్థ వరకు నిరంతరాయంగా 8 నెలలు శీతల వాతావరణం ఉండేలా చూసుకుంటూ సాగు చేయాల్సి ఉంటుందని ఆమె వివరించారు.
ప్రారంభ పెట్టుబడి తర్వాత లాభదాయకం
ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వు సాగు చేయడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మొదటి ఏడాది మాత్రమే పెట్టుబడి అవసరమవుతుంది. దివ్య కుంకుమపువ్వు సాగు కోసం ప్రారంభంలో రూ.5లక్షలు పెట్టుబడి పెట్టారు. ఐదు నెలల సరైన సంరక్షణ తర్వాత, ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ దంపతులు ఇప్పుడు తమ ఉత్పత్తికి బ్రాండింగ్ చేసి విక్రయిస్తున్నారు. కుంకుమపువ్వు సాగులో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు, ఆ తర్వాత లాభాలు వస్తాయని అంటున్నారు. రెండో ఏడాది నుంచి విత్తన ఖర్చు ఉండదు. నాలుగైదు ఏండ్లలో పెట్టుబడి తిరిగి రావడంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. పెద్ద మొత్తంలో సాగు చేస్తే ఉపయోగం ఉంటుంది. కుంకుమ పువ్వు సాగును ఇంటిపంటగా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. నాణ్యమైన కుంకుమ పువ్వును మనమే పండించుకోవచ్చు.
ఇంట్లోనే స్వచ్ఛమైన కుంకుమ పువ్వు : దివ్య
దేశానికి ప్రతి సంవత్సరం అవసరమయ్యే కుంకుమపువ్వులో కేవలం 20 శాతం మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతుంది. మిగిలిన కుంకుమపువ్వును ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘ఏరోపోనిక్స్’ సాంకేతికత సహాయంతో 100 శాతం స్వచ్ఛమైన కుంకుమపువ్వును ఇంట్లోనే పండించవచ్చు. దీని ద్వారా రైతులు లక్షల రూపాయల లాభం పొందవచ్చు. నేను బ్యాంకు ఉద్యోగం చేసుకుంటూనే వ్యవసాయం, మొక్కల పెంపకంపై ఉన్న ఆసక్తితో దీన్ని ప్రాంభించాను. విజయం సాధించాము. ఇది మన రైతులు కూడా చేపబడితే లాభాలు పొందవచ్చు. మన దేశానికి అవసరమైన స్వచ్ఛమైన కుంకుమపువ్వును మనమే అందించవచ్చు.







కామెంట్‌లు (0)