నిహారిక భట్... విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌లో నానోపార్టికల్స్ వారితో కలిసి విషపూరిత ప్రభావంపై పరిశోధన చేసే స్థాయికి ఎదిగారు. విదేశాల్లో మంచి ఉద్యోగాన్ని వదిలి పుట్టిన దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో తిరిగి వచ్చారు. సివిల్స్ వైపు అడుగులు వేశారు. యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక పరిశోధనా ప్రయోగశాల నుండి ఇండియాలో పోలీసు అధికారి వరకు సాగిన ఈ ప్రయాణం ఒక సాధారణ వృత్తి మార్పు కాదు. నేడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. నిహారిక భట్ తాను పుట్టి పెరిగిన ప్రాంతమైన లక్నోలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ నుంచి ఎంటెక్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్ డీసీలో పరిశోధకురాలిగా పనిచేశారు.
అప్పట్లో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన కెరీర్ లభించే అవకాశం ఉంది. కానీ ఆమెకు మొదటి నుంచి దేశ సేవ చేయాలనే కోరిక బలంగా ఉండేది. అదే ఆమెను అమెరికా నుంచి సొంత గడ్డకు వచ్చేలా చేసింది. ఆ తర్వాత ఆమె సివిల్స్ వైపు అడుగులు వేశారు. ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే తొలి ప్రయత్నంలోనే 2015లో విజయం సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. రోజూ వార్తాపత్రికలు చదవడం, సమకాలీన అంశాలపై అవగాహన, వివిధ విషయాలపై ప్రాథమికగా అవగాహన తదితరాలన్నీ సివిల్స్ ప్రిపరేషన్లో తనకు అత్యంత కీలకంగా ఉపయోగపడ్డాయని ఆమె చెబుతున్నారు. ఆమె తన వృత్తిని రిషికేశ్‌లో ఎస్హెచ్ఓ (SHO)గా ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని నార్త్ డిస్ట్రిక్ట్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
దృఢ నిశ్చయంతోనే...
ఔత్సాహిక సివిల్స్ అభ్యర్థులకు విజయం సాధించడానికి పాటించాల్సిన ముఖ్య సూచనలు చెబుతున్నారు. ‘ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధించడానికి కీలకమైనది ఒకే పుస్తకాన్ని పదే పదే చదవండి. పుస్తకాలు కలెక్ట్ చేసుకున్నంత మాత్రం విజయం వరించదు. నిర్ధిష్ట అంశానికి సంబంధించిన నాణ్యమైన పుస్తకాన్ని ఎంచుకుని పదేపదే చదవాలి. ఏదైనా అంశంపై పట్టు సాధించాలంటే.. దానిని అనేకసార్లు అధ్యయనం చేసి.. లోతైన అవగాహన పెంచుకోవాలి. అలాగే ఒకే పుస్తకాన్ని పదే పదే చదివితే ఆ అంశంపై అవగాహన పెరుగుతుంది. ఈ విధానమే పరీక్షలో మెరుగైన సమాధానాలు రాయడానికి ఎంతగానో తోడ్పడుతుంది. దృఢ నిశ్చయమే గమ్యాన్ని చేర్చడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం అంతర్జాలం యువతకు ఒక వరం. అలాగే ముఖ్యంగా సైన్స్ నేపథ్యం ఉన్న విద్యార్థులు, హ్యుమానిటీస్ సబ్జెక్టులలో సమాధానాలు రాయడానికి ఒక ప్రత్యేక శైలి అవసరం. దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ అంశంపై మంచి అవగాహన ఉన్న వ్యక్తులను సంప్రదించాలి. ఈ శైలిని అభ్యసించడానికి నాకు కూడా కొంత సమయం పట్టింది’ అంటున్నారు నిహారిక.







కామెంట్లు (0)