నవతెలంగాణ – హైదరాబాద్ : దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఒక భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. భారత మాజీ ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడైన నరేష్ గుజ్రాల్ ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. టెక్స్‌టైల్స్, లెదర్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను నడుపుతున్న నరేష్ గుజ్రాల్ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను దొంగిలించిన కేటుగాళ్లు.. ఆయన పేరుతో ఒక నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు. జూన్ 12 నుంచి 16వ తేదీల మధ్య కాలంలో సదరు నకిలీ ఖాతా ద్వారా గుజ్రాల్ కంపెనీకి చెందిన ఆర్థిక విభాగపు నమ్మకస్థుడైన ఉద్యోగిని సంప్రదించి, అత్యవసరంగా కొన్ని బ్యాంకు ఖాతాలకు కోట్ల రూపాయల నగదును బదిలీ చేయాల్సిందిగా ఆదేశించారు. అవతలి వ్యక్తి తన యజమానేనని నమ్మిన ఆ ఉద్యోగి, ఎలాంటి అనుమానం లేకుండా నాలుగు వేర్వేరు లావాదేవీల ద్వారా కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాల్లోకి బదిలీ చేశారు. జూన్ 16న ఈ నగదు బదిలీల సమాచారాన్ని సదరు ఉద్యోగి నరేష్ గుజ్రాల్ కుమార్తె దీక్షా గుజ్రాల్‌కు తెలియజేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆమె వెంటనే తన తండ్రిని సంప్రదించగా, తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా తక్షణమే ఫిర్యాదు చేసి ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.
భారీ సైబర్ మోసం.. మాజీ ప్రధాని కుమారుడి అకౌంట్ నుంచి కోట్లు స్వాహా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



