Tuesday, June 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

- Advertisement -

రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రత..32 మందికి పైగా మృతి
మూడు అడుగుల మేర సునామీ అలలు
పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
ఇండోనేషియా, మలేషియా తీరాలకూ సునామీ ముప్పు


మనీలా : ఫిలిప్పీన్స్‌లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దేశ దక్షిణ భాగంలోని మిండానో ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఫిలిప్పిన్స్‌ తీరంలో మూడడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడ్డాయి . ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధ్యక్షుడు మార్కోస్ సూచనలు చేశారు. అయితే ఈ భూకంపం కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:37 గంటలకు ఈ భూకంపం సంభవించినట్టు అధికారులు వెల్లడించారు. జనరల్‌ శాంటోకు నైరుతి దిశగా 13 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఫిలిప్పీన్స్‌లోని కొన్ని తీర ప్రాంతాల్లో మూడు మీటర్ల వరకు (దాదాపు 10 అడుగులు) ఎత్తున్న సునామీ అలలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే టెరెసిటో బకోల్కోల్ వెల్లడించిన వివరాల ప్రకారం, సుల్తాన్ కుదరత్, సంరగాని ప్రావిన్సుల్లో సుమారు ఒక మీటర్ (మూడు అడుగులు) ఎత్తున్న సునామీ అలలు నమోదయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో చిన్న స్థాయి సముద్ర అలల మార్పులు కనిపించాయి.

విద్యుత్ అంతరాయం
భూకంపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. సహాయక బృందాలు పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. జనరల్ శాంటోస్ నగరంలోని ఒక షాపింగ్ మాల్, ఒక ప్రముఖ యూనివర్సిటీ భవనం పాక్షికంగా కూలిపోయాయి. ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే ఈ ప్రమాదం జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలోని ఒక భాగం కూలిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భవనంలో ఉన్న సిబ్బంది వెంటనే బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. కొన్ని ప్రాంతాల్లో భవనాల నుంచి శిథిలాలు కిందపడటంతో పార్క్ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి ప్రజలకు అధ్యక్షుడి హెచ్చరిక ప్రజలు భద్రత కోసం ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ పిలుపునిచ్చారు.

సునామీ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. ప్రాణాల కంటే విలువైనది మరేదీ లేదని పేర్కొన్నారు. అలాగే మిండనావో ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, విపత్తు నిర్వహణ సంస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు లేదా లోతట్టు ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

పొరుగు దేశాలకూ హెచ్చరిక
ఇండోనేషియా, మలేసియా తీర ప్రాంతాల్లో ఒక మీటరు వరకు ఎత్తున్న అలలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే తైవాన్‌, జపాన్‌, పపువా న్యూ గునియా కూడా సహా పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోని పలు ద్వీప దేశాలకు కూడా అప్రమత్త సూచనలు జారీ చేశారు.

విపత్తులకు కేంద్రంగా ఫిలిప్పీన్స్
ఫిలిప్పీన్స్ ప్రపంచంలో అత్యధిక ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే దేశాల్లో ఒకటి. ఇది పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన పసిఫిక్ రింగ్ ఆఫ్ పైర్ అనే ప్రాంతంలో ఉండటంతో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. అంతేకాకుండా ప్రతి ఏడాది సుమారు 20 వరకు తుఫాన్లు, ఉష్ణమండల తుఫాన్ల ప్రభావాన్ని కూడా ఈ దేశం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -