మావూరు రాములోరు

Mavoor Ramuluఓ రామేశు, నర్సింమ్మ, చెన్న, అంజి, కృష్ణ, అందర్ని పిలవండి. జప్ప జప్ప రండ్రి, నిమ్మలంగ కుసొని మంచిగినుండ్రి.
రేపు రామ్నౌమి గద, అందుకొరకే పిల్సిన. మన ఊర్ల ఇప్పటి వరకు చేయలేదు గాని మనూరి బాగుకొరకు చేస్తే మంచిదన్పిచ్చి సర్పంచి కాకని, అయ్యగార్ని అడిగిన, గట్లనె చెయ్యెచ్చుగాని, టైమ్‌ తక్కుందని నసిగిండ్రు మీరొప్కుంటే గంతనె సాలు పిల్లలందరి సేత నెత్తికోపని ఒప్పజెప్పి నెన్జెస్త. అదేమ్‌ పెద్ద కస్టమ్‌ కాదు రాందండు లెక్క వుర్కొచ్చి జేస్తరు. పరిచ్చలు అయిపోయినంక గూడ మూడ్రోజులు టైమ్‌ ఉంటది అని ఒప్పించిన. హన్మంతుడి గుడికాడ పందిరి ఏసి చేద్దమన్నరు.
మీరందరు రేపు పొద్దుగాల కోడి గూయంగనే లేసి, చేనికిపోయి మామిడి ఆకులు, యాప మండలు లెంప్కరావాలె. పందిట్ల తోర్నమ్‌ కట్టినంక కొన్ని అట్లే గోదుమ బస్తల పెట్టి మందికి ఊప్కోనికె పెట్టాలె. అది ఎందుకంటే ఒడదెబ్బ కొట్టకుండ.
శమంత, శివలీల, అనూశ, ఆన్రద, మీడ్లకడ, మండ్లకాడ, ఏ పూలు వుంటే అవి తెంప్కరండ్రి. తుల్సాకులు ఇంకిన్ని జమచేసి దండ గట్టి రామ్లోరికి ఎయ్యెచ్చు.
మామ్దాకులు, యాపాకులు, తెంపినంక కూడ గదేంది మనం పీల్చుకునేద్డి ఆ.. ఆక్సిజన్‌ ఇస్తదంట. మంచి పన్కి ఎప్పుడైనా ముందుండాలె. సోమర్తనం ఒద్దు. సెప్తున్న, గట్లని గయ్య గయ్య అర్సుకుంట గడిబిడి సెయ్యొద్దు.
ఏ పంజేస్తన్న సూసేటోల్లు మర్సేటట్టు, మెచ్చెటట్టు ఉండాలె. మనింటి పని అనుకోవాలె. అయినా దేవుని పెళ్లికి అందరూ పెద్దలేనాయె అని సామెతనే ఆయే.
అందరు కల్సిమెల్సి పని చేసుకోవాలె. అవన్ని ఇసువొట్టి పనిలోనే సూపెట్టాలె.
పొద్దుగాలనే లేసి తానం చేసినాక పాన్కం చేయనికె బెల్లం దంచి మిరియాలు దంచుంచుత.
గుడికాడ్కి ఎల్లికాక అయ్యగారి బ్యా పాన్కం నానవెడ్తది. మోత్కు ఆకులు తెస్తె, వడపప్పు, ప్రసాదం అందులోనే పెట్టొచ్చు.
మోత్కాకులు వాడకం తెల్వి పంచ్తుంది. ఎండకాలం కద, వడపప్పుకి పెసరపప్పు వాడాలె. ఎందుకంటే సల్వ. మిరియాలు, బెల్లం పాన్కం తగంగనే దూప తగ్గడమే కాదు ఓప్కొస్తది.
కిరాన దుక్నుమ్‌ మస్తాను, సీరామ్దాసు, సిన్మల తానిస ముత్యాలు ఇచ్చిండు గదా, నేనైదు కిలోల బియ్యమిస్తపో అంటుండె. ఏదో నివయ, కాస్మల్లి తన దుక్నుం కెంచి పస్పు, అత్తరిస్తనన్నడు. పూజ సూడనీకె దుక్నుం మూసి వత్తునా అన్నడు. మనూర్కి కబిర్దాసు నివ్వేలే పో అని సర్పంచి కాక మజాక్‌ చేసిండు.
– గంగరాజ పద్మజ, 9247751121

Spread the love