నగరంలోని డిఆర్సి సెంటర్లో ఏర్పాటు చేసిన వీధి కుక్కల నియంత్రణ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సుపరిండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్, వెటర్నరీ డాక్టర్ తో కలిసి మేయర్ శుక్రవారం సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తున్న వీధి కుక్కల స్వైర విహారాన్ని నగర ప్రజల పైన పడకుండా ఉండడానికి నగరంలో గత ఐదు సంవత్సరాలుగా వీధి కుక్కల నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వీధి కుక్కలను సంతాన ఉత్పత్తి కలగకుండా ఆపరేషన్ చేసి కుక్కల నియంత్రణకు కృషి చేస్తున్నామని నగర మేయర్ దండు నీతూ కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు చిన్న పిల్లలను చీకటి సమయాల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా చూడాలని, ఎవరైనా ప్రమాదవశాత్తు కుక్కకాటుకు గురైతే స్థానిక జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రిని సందర్శించి తగిన చికిత్సలు తీసుకోవాలని తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీధిలో సంచరించే కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకొచ్చి ఆపరేషన్లు చేసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీధి కుక్కల బెడద సమస్య ఉన్నట్లయితే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08462 220234 కు సమాచారం అందించినట్లయితే వెంటనే ప్రత్యేక బృందం వారు వచ్చి కుక్కలను తీసుకెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, ఇన్చార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సాజిద్ అలీ ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.