నవతెలంగాణ-హైదరాబాద్: రాజమండ్రిలో ఇద్దరు యువకుల రాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు ప్రకటించారు.
కాగా, ప్రియాంక కర్నూలుకు చెందిన యువతి. ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది.ప్రియాంకను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పలు రోజుల చికిత్స అందించిన ఆమె ప్రాణాలు దక్కలేదు.



