జనరిక్‌ మందులపై మెడ్‌ప్లస్‌ కీలక దృష్టి

జనరిక్‌ మందులపై మెడ్‌ప్లస్‌ కీలక దృష్టి– ఔషదాలపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ :70% అవసరాలను తీర్చగలవు
– మరిన్ని రాష్ట్రాలకు విస్తరణ
– మరో 600 స్టోర్లు తెరుస్తాం
– సంస్థ ఎండీ, సీఈఓ గంగడి మధుకర్‌ రెడ్డి వెల్లడి
హరిద్వార్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల రిటైలర్‌ చెయిన్‌ మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ జనరిక్‌ ఉత్పత్తుల రంగంలోని విస్తృత అవకాశాలపై కీలక దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం తన ఉత్పత్తుల పోర్టుపోలియోను పెంచుతోన్నట్లు ప్రకటించింది. అదే విధంగా కొత్త స్టోర్ల ఏర్పాటులోనూ వేగాన్ని పెంచుతోన్నట్లు వెల్లడించింది. హరిద్వార్‌లో అకూమ్స్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ జాయింట్‌ ఎండీ సందీప్‌ జైన్‌తో కలిసి మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఎండీ, సీఈఓ గంగడి మధుకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తమ 706 ఔషదాల్లో 550 కూడా జనరిక్‌ ఉత్పత్తులేనని మధుకర్‌ రెడ్డి వెల్లడించారు. ఇందులో 450 మెజారిటీ ఉత్పత్తులను అకూమ్స్‌తో కాంట్రాక్ట్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరింగ్స్‌ (సీడీఎంఎఎస్‌) ఒప్పందం ద్వారా తయారు చేస్తున్నామన్నారు. తమ సొంత నెట్‌వర్క్‌లో ఇంతక్రితం బ్రాండెడ్‌, జనరిక్‌ ఉత్పత్తులపై కనీసం 10 తగ్గింపు ధరలను ఇవ్వగా.. ఇటీవల దీన్ని 20 శాతానికి పెంచామని.. మెడ్‌ప్లస్‌ బ్రాండ్‌ ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నామన్నారు. తమ ఉత్పత్తులు 70 శాతం అవసరాలను తీర్చగలవన్నారు. ఇతర దిగ్గజ ఫార్మా విక్రయ సంస్థలు కూడా జనరిక్‌ ఉత్పత్తుల గురించి మాట్లాడుతున్నాయని ఆయన గుర్తు చేశారు.ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లోని 4200 పైగా తమ స్టోర్లలో ఈ తగ్గింపు ధరలకు ఔషదాలను విక్రయిస్తున్నామన్నారు. దీని ద్వారా గడిచిన ఆరు నెలల్లో 26.2 లక్షల వినియోగదారులకు దాదాపు రూ.140 కోట్లు ఆదా అయ్యిందన్నారు. సరసమైన ధరలో విస్తృత శ్రేణీలో నాణ్యమైన జనరిక్‌ ఔషధాలను అందిస్తున్నామన్నారు. కొత్తగా తాము కేరళ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లకు విస్తరిస్తున్నట్లు గంగడి మధుకర్‌ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో కొత్తగా 600 స్టోర్లను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెడ్‌ప్లస్‌ అమ్మకాల్లో 7-8 శాతం రెవెన్యూ ఆన్‌లైన్‌ అమ్మకాల ద్వారా చేకూరుతుందన్నారు. హైదరాబాద్‌లోని 12 డయగస్టిక్‌ కేంద్రాలు బాగా పని చేస్తున్నాయన్నారు. ఇప్పటికీ పైలట్‌ ప్రాజెక్టులోనే ఇవి నడుస్తోన్నాయన్నారు. మెడ్‌ప్లస్‌ ప్రతి నెలా కోటి మంది వినియోగదారులకు సేవలందిస్తుందన్నారు

Spread the love