‘మేఘా’ లంచాలు..

'Megha' bribes..– ఎంఇఐఎల్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు
– 10 మంది అధికార్లపై కూడా..
– రూ.78 లక్షల ముడుపులు..!
– రూ.315 కోట్ల అవినీతి..
– బిల్లుల క్లియరెన్స్‌కు తప్పుడు మార్గాలు
– బీజేపీ ఎలక్ట్రోల్‌ బాండ్ల కొనుగోలులో టాప్‌2 కంపెనీ
న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(ఎంఇఐఎల్‌)పై లంచం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మెకాన్‌, ఎన్‌ఐఎస్‌పీ, ఎన్‌ఎండీసీకి చెందిన 10 మంది అధికారులు రూ.315 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రధాన అరోపణ. జగదల్‌పూర్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పనులకు సంబంధించి రూ.174 కోట్ల బిల్లులను పొందడానికి మెకాన్‌ అధికారుల చేతులు తడిపినట్టు ప్రధాన అరోపణ. ఈ ప్రాజెక్టులో అధికారులకు దాదాపు రూ.78 లక్షలు లంచాలు ముట్టజెప్పిందని ప్రాథమిక విచారణలో తేలింది. ముడుపుల ఆరోపణలపై ఎన్‌ఐఎస్‌పీ, ఎన్‌ఎండీసీకి చెందిన ఎనిమిది మంది అధికారులు, మెకాన్‌కు చెందిన ఇద్దరు అధికారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. మేఘా ఇంజనీరింగ్‌కు ఎన్‌ఎండీసీ సంబంధించిన ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐఎస్‌పీ) ఐదేండ్ల పాటు ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కాంట్రాక్ట్‌ వచ్చింది. దాంతో పాటు నిస్ప్‌ ప్రాజెక్ట్‌ ఇంటేక్‌ వెల్‌ అండ్‌ పంప్‌ హౌస్‌, క్రాస్‌ కంట్రీ పైప్‌లైన్‌ పనులు మేఘాకు కేటాయించారు. అయితే తమకు ఈ ప్రాజెక్ట్‌ వచ్చేలా చేసుకునేందుకు.. అనంతరం బిల్లుల క్లియరెన్స్‌లో అధికారులకు లంచాలు ముట్ట జెప్పిందనే ఆరోపణలు ఉన్నాయి. గతనెల ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం.. మేఘా ఇంజినీరింగ్‌ అధికంగా రూ.966 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్ల(ఈబీ)ను కొనుగోలు చేసి రెండో స్థానంలో ఉంది. అత్యధికంగా దాదాపు రూ.586 కోట్లను బీజేపీకి విరాళంగా ఇచ్చింది. అలాగే బీఆర్‌ఎస్‌కు రూ.195 కోట్లు, వైసీపీకి రూ.37 కోట్లు, టీడీపీకి రూ.25 కోట్లు చొప్పున నిధులను విరాళంగా సమకూర్చింది. కాగా.. అధికార, ప్రతిపక్ష పార్టీలకూ కోట్ల రూపాయల్లో విరాళాలు అందించిన మేఘా ఇంజనీరింగ్‌పై లోక్‌సభ ఎన్నికల ముందు సీబీఐ చర్యలు తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది.
జగదల్‌పూర్‌లోని మెకాన్‌ కంపెనీకి దక్కిన ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఇంటెక్‌ వెల్‌, పంప్‌ హౌస్‌, క్రాస్‌ కంట్రీ పైప్‌లైన్‌ పనులకు సంబంధించి రూ.174 కోట్ల బిల్లుల చెల్లింపుల్లో అధికారులకు లంచాలను ముట్టజెప్పింది. ఈ ఆరోపణలపై సీబీఐ గతేడాది ఆగస్టు 10న ప్రాథమిక విచారణను నమోదు చేసింది. ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ఆధారంగా మార్చి 31న సాధారణ కేసు నమోదైంది. ఎన్‌ఐఎస్‌పీ, ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌కు చెందిన ఎనిమిది మంది అధికారుల పేర్లను సీబీఐ పేర్కొంది.. వీరు రూ. 73.85 లక్షల లంచం అందుకున్నారని ఆరోపించింది. అలాగే.. రూ. 5.01 లక్షల చెల్లింపును అందుకున్నారన్న ఆరోపణలతో మెకాన్‌ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు అధికారుల పేర్లనూ సీబీఐ చేర్చింది. ఈ కేసులో ఎన్‌ఎండీసీ, ఎన్‌ఐఎస్‌పీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ దాస్‌, డైరెక్టర్‌ (ప్రొడక్షన్‌) డికె మోహంతి, డీజీఎం పికె భుయన్‌, డీఎం నరేష్‌ బాబు, సీనియర్‌ మేనేజర్‌ సుబ్రో బెనర్జీ, రిటైర్ట్‌ సీజీఎం (ఫైనాన్స్‌) ఎల్‌ క్రిష్ణ మోహన్‌, జీఎం (ఫైనాన్స్‌) కె రాజ శేఖర్‌, మేనేజర్‌ (ఫైనాన్స్‌) సోమ్నాత్‌ ఘోష్‌లు రూ.73.85 లక్షలు తీసుకున్నట్టు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ చేర్చింది. మెకాన్‌కు సంబంధించి ఏజీఎం (కాంట్రాక్ట్స్‌) సంజీవ్‌ సహరు, డీజీఎం కె ఇల్లవర్సులు రూ.174.41 కోట్ల చెల్లింపుల్లో రూ.5.01 లక్షల లంచం తీసుకున్నారని సీబీఐ తెలిపింది. ఎంఇఐఎల్‌ జనరల్‌ మేనేజర్‌ సుభాష్‌ చంద్రకు చెందిన 73 ఇన్‌వాయిస్‌ల చెల్లింపులు జరగడంతో ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.

Spread the love