దయనీయం

– రిటైర్ట్‌ హైకోర్టు జడ్జిలకు తక్కువ పెన్షన్‌పై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : కొంత మంది రిటైర్ట్‌ హైకోర్టు జడ్జీలు రూ. 10 వేలు నుంచి రూ 15 వేలు మధ్య పెన్షన్‌ పొందడం ‘దయనీయం’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రిటైర్డ్‌ హైకోర్టు జడ్జీల పెన్షన్‌కు సంబంధించిన పిటీషన్లు జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌ల ధర్మాసనం ముందు విచారణ కోసం జాబితా అయ్యాయి. ధర్మాసనం ముందు వీటి గురించి అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి మాట్లాడుతూ జనవరిలో విచారించాలని అభ్యర్థించారు. ఈ అంశాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు. దీనికి ‘మా జోక్యాన్ని నివారించాలని ప్రభుత్వాన్ని ఒప్పించడం మంచిది’ అని ధర్మాసనం తెలిపింది. ప్రతి విషయంలోనూ చట్టపరమైన విధానాన్నే కాదు, మానవీయ ధృక్పథాన్ని కలిగి ఉండాలని సూచించింది. అలాగే వ్యక్తిగత కేసులు మాదిరిగా ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోమని, హైకోర్టు జడ్జీలందరికీ వర్తించే విధంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. జనవరి 8కి ఈ పిటిషన్‌ విచారణను వాయిదా వేసింది.కాగా, గతనెలలోనూ రూ. 15 వేలు మాత్రమే పెన్షన్‌ పొందుతున్న ఒక హైకోర్టు మాజీ జడ్జి వేసిన పిటిషన్‌ను ఈ ధర్మాసనం విచారించింది. జిల్లా కోర్టులో 13 ఏండ్ల పాటు పనిచేసి తరువాత అలహాబాద్‌ హైకోర్టు జడ్జిగా ప్రమోషన్‌ పొందారు. అయినా పెన్షన్‌ను లెక్కించేటప్పుడు తన న్యాయ సేవలను పరిగణనలోకి అధికారులు తీసుకోలేదని జడ్జి ఆరోపించారు. జిల్లా న్యాయవ్యవస్థ నుంచి ప్రమోషన్‌ పొందినా పెన్షనరీ ప్రయోజనాలను హైకోర్టు జడ్జిగా తీసుకున్న చివరి జీతం ఆధారంగా లెక్కించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

Spread the love