పోషకాహార లోపంతో దయనీయ పరిస్థితులు !

పోషకాహార లోపంతో దయనీయ పరిస్థితులు !– గాజాలో పరిణామాలపై కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రి హెడ్‌ ఆందోళన
– తాజా దాడుల్లో 9మంది మృతి
గాజా : ఇజ్రాయిల్‌ మూర్ఖత్వం, దురహంకారం గాజాలో బాలల ఉసురు తీస్తోంది. మానవతా సాయం సరఫరాలకు వీల్లేకుండా దారులన్నీ మూసివేయడంతో గాజాకు ఆహార సరఫరాలు నిలిచిపోయాయి. దీంతో ఆకలితో పిల్లలు అల్లాడుతున్నారు. తాజాగా సరైన పోషకాహారం లేక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో 14ఏళ్ళ ముస్తఫా హిజాజి మరణించాడు. గాజా ఆరోగ్య వ్యవస్థ చాలా దయనీయమైన స్థితిలో వుందని వైద్య సరఫరాలు, ఇంధన కొరత కారణంగా సక్రమంగావైద్య సేవలు అందించలేకపోతున్నామని కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రి హెడ్‌ హౌసమ్‌ అబూ సఫియా ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇజ్రాయిల్‌ హెలికాప్టర్‌ గన్‌షిప్‌లు, అటాక్‌ డ్రోన్‌లు, యుద్ధ విమానాలు రఫాపై దాడులు కొనసాగిస్తున్నాయి. మరోవైపు వీధుల్లో ఎక్కడ చూసినా పోరాట దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 37,266మంది మరణించారు. 85,102మంది గాయపడ్డారు. గత 24గంటల్లో ఒక నివాస భవనంపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. తూర్పు రఫాలో మరో ఇద్దరు చనిపోయారు. కనీస వైద్య సరఫరాలు వున్నా మనం చాలామంది ప్రాణాలు కాపాడవచ్చని కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రి హెడ్‌ హౌసమ్‌ అబూ వ్యాఖ్యానించారు. పోషకాహార లోపంతో బాధపడే కేసులను పరిష్కరించ వచ్చన్నారు. కానీ అవసరమైన సరఫరాలు, వసతులు లేకపోవడంతో పోషకాహారం లోపం ఎదుర్కొంటున్న వారిలో సమస్యలు మరింత ముదిరి తీవ్ర పర్యవసా నాలకు దారి తీస్తున్నాయన్నారు. కేవలం మైదా పిండి తప్ప మరే విధమైన ఆహారపదార్ధాలు అందు బాటులోవుండడం లేదని, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పశు సంపద లేకుండా పోయిందని, దాంతోఎలాంటి మాంసం లేదని, ప్రొటీన్ల లోపం తీవ్రంగా వున్నందువల్ల కార్పొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు వంటి వాటి కోసం అదనపు చికిత్సలు చేయాల్సిన అవసరం ఏర్పడుతోందన్నారు. అయితే వైద్య సరఫరాలు, ఆహార పదార్ధాలు ఇలా అందుబాటులో ఏవీ లేకపో వడంతో తమకు చేతులు కట్టేసినట్లు అవుతోందని ఆయన ఒక ఇంటర్వ్యూలో తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. రెండు మాసాల క్రితమే ఉత్తర గాజాలో పోషకాహార లోపంతో 26మంది పిల్లలు మరణించారు. సరైన ఆహారం లేక సుదీర్ఘకాలం ఇదే పరిస్థితి వుంటే పిల్లల్లో చాలా తీవ్రమైన పర్యవసానాలు ఎదురవుతాయ న్నారు. ఇకనైనా తక్షణావసరాలు తీరేలా అన్ని రకాల ఆహార పదార్దాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. రాబోయే రోజుల్లో ఎలాంటి సాయం అందకపోతే మరింత మంది పిల్లలు మృత్యువాత పడే అవకాశం వుందని హెచ్చరించారు. గత రెండు మాసాలుగా గాజాలోకి ఎలాంటి పోషకాహార పదార్ధాలు రాలేదని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 200మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వీరికి త్వరలో ఎలాంటి సప్లిమెంట్‌ అందని పక్షంలో మృత్యువుకు చేరువయ్యే ప్రమాదముందన్నారు.

Spread the love