ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కారు బోల్తా

ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కారు బోల్తా– ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు
నవతెలంగాణ- వెల్గటూర్‌
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం లోని అంబారిపేట టర్నింగ్‌ వద్ద సోమ వారం తెల్లవారు జామున ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన సోమవారం హైదరాబాద్‌ నుంచి ధర్మపురి నియోజకవర్గానికి వస్తుండగా ఎండపల్లి మండలం అంబారిపేట, కొత్తపేట మధ్యలో టర్నింగ్‌ వద్ద వరంగల్‌ రాయపట్నం రాష్ట్ర రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కారు పల్టీలు కొట్టింది. చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సమయంలో కారులోనే ఉన్న ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తల, కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో స్థానిక ఎస్‌ఐ ఉమా సాగర్‌ ఘటనా స్థలానికి వెళ్లి లక్ష్మణ్‌కుమార్‌ను కరీంనగర్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

Spread the love