మానసిక ఉల్లాసంతోనే ఆరోగ్యం: ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

– ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం సమయం కేటాయించాలి
– ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
– చావా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీర్ల ఐలయ్య
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ప్రతి ఒక్కరితో ప్రేమ, స్నేహభావంతో, ఆటపాటలు, శారీరక వ్యాయామం, మానసిక ఉల్లాసం తోనే మనుషులకు ఆరోగ్యం అని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం సైదాపురం, ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బీర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనలో ఉన్న జబ్బు మనకు తెలియకుండా మనల్ని తినేస్తుంది కాబట్టి కనీసం నెలకు రెండు నెలలకు ఒకసారి బాడీని చెకప్ చేయించుకోవాలి అని సూచించారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, శ్రమ కూడా తగ్గింది కారణంగా మనుషుల జీవిత కాలం కూడా తగ్గింది అన్నారు. ఒకప్పుడు మనుషుల జీవితకాలం 100 సంవత్సరాలు పైబడి ఉండేది కానీ ఈ మధ్యకాలంలో ఏ ఊర్లో చూసిన వయస్సు 40 నుంచి 50 సంవత్సరాల వారు ఆకస్మికంగా ఎక్కువ చనిపోతున్నారు. ఏ రూపాయలు లేకుండా మన గ్రామపంచాయతీ దగ్గర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు బాడీ చెకప్ చేస్తున్నందుకు చావా ఫౌండేషన్ వారిని అభినందించారు. ఈ రోజుల్లో టీవీలకు అతుక్కుపోవడం, బాడి శారీరకంగా శ్రమ లేకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, విపరీతమైన సెల్ఫోన్ల వాడకం వల్ల జబ్బులు పెరిగిపోయినవి కాబట్టి ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకుని డాక్టర్ల సూచనలు సలహాలు పాటించాలని సూచించారు. సెల్ఫోన్లు, టీవీలను అవసరమేరకే వాడాలి అని అన్నారు. డాక్టర్ లను సంప్రదిస్తే స్టార్టింగ్ స్టేజిలో ఎంత పెద్ద రోగాన్ని అయినా తగ్గించవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం సమయం కేటాయించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం తరఫున చావా ఫౌండేషన్కు ఇలాంటి సేవా కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇంకా చాలామందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి సేవ చేయాలని అన్నారు. జీవితంలో సంతోషం లేకపోతే ఆయుష్షు తగ్గుతది, నలుగురితో నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉంటే ఆయుషు పెరుగుతది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ సర్పంచ్ బీర్ల శంకర్, దుంబాల వెంకటరెడ్డి డాక్టర్లు,  వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love