నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ లో సబ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నానని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో బైపాస్ రోడ్డు చౌరస్తాలో మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సబ్ మార్కెట్ యార్డ్ కోసం అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని చెప్పారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సబ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 28 ప్యాకెజీ పనులు మళ్లీ కొనసాగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. ఈ ప్యాకేజీ పనులు పూర్తయితే ముధోల్ నియోజకవర్గంలో సుమారు 50 వేలకు పైగా సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిధుల కొరత వల్ల అభివృద్ధి పనులు కొంత వెనుకబాటుకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో ముధోల్ నియోజక వర్గాన్ని ఆయారంగాలో అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇంటర్ కళాశాలలో ముధోల్ కు రప్పించడం జరిగింది అన్నారు. తాను విద్య, వైద్యం, ఇరిగేషన్ కు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. మూడున్నర సంవత్సర పదవికాలంలో అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.ఈ సందర్భంగా విగ్రహ కమిటీ సభ్యులను అభినందించారు.అలాగే బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ మాట్లాడుతు ముధోల్ లో సబ్ మార్కెట్ యార్డ్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. త్వరలో సబ్ మార్కెట్ యార్డ్ కు ప్రభుత్వ మంజూరు చేస్తుందని అన్నారు. ఈ విషయాన్ని మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ శ్రీకాంత్, విగ్రహా కమిటీ అధ్యక్షుడు పోతన్న యాదవ్, బీడిసి అధ్యక్షుడు విఠల్, మాజీ ఎంపిపి ఎజాజోద్దిన్, మాజీ సర్పంచ్లు బోయిడి అనిల్,రాజేంధర్, బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, నాయకులు ధర్మపురి సుదర్శన్, తాటివార్ రమేష్, దేవోజీ భూమెష్, శ్రీనివాస్, సంతోష్, ఆయా పార్టీల నాయకులు, విగ్రహ కమిటీ సభ్యులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.