నవతెలంగాణ-నవీపేట్: వరి ధాన్యం కొనుగోలులో రైతులకు, నిర్వాహకులకు ఎవరైనా ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంతో పాటు అభంగపట్నం, నాగేపూర్ గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వరి ధాన్యం కొనుగోలులో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. లారీ డ్రైవర్లు, రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులు కలిగిస్తే బ్లాక్ లిస్టులో పెట్టడమే కాక కేసులు నమోదు చేయాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవస్థ మార్పునకు కఠిన చర్యలు తప్పవని అన్నారు,అనంతరం నాగేపూర్ శ్రీరామ ఆలయాన్ని సందర్శించారు. రైతులు 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని ధాన్యం కొనుగోలుకు తరలించి మద్దతు ధరతో పాటు బోనస్‌ను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సాయి గౌడ్, మార్కెటింగ్ డిపిఎం సాయిలు తహసిల్దార్ వెంకటరమణ, ఏపీఎం భూమేశ్వర్ గౌడ్ మరియు మహిళా సంఘ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.