మతం మాటున మోడీ.. అవినీతి చాటున కేసీఆర్

– ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీ బీఆర్ఎస్ కు లేదు
– దేశంలో రానున్నది ఇందిరమ్మ రాజ్యం
– పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
మతం మాటున నరేంద్ర మోడీ రాజకీయం చేస్తుంటే.. పది సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన అవినీతి చాటున కేసిఆర్ రాజకీయం చేయడం నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనం వంటిదని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సన్నూరు, వెంకటేశ్వర పల్లి తదితర గ్రామాల్లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఎమ్మెల్యేకు కోలాట ఆటపాటలతో, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని మరోసారి చూపెట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యకు అకాండ మెజారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బిఆర్ఎస్ చేసిన పాలన రాక్షస పాలన అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అన్నారు. దేశంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.  బిజెపి బిఆర్ఎస్ రహిత నియోజకవర్గంగా పాలకుర్తిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్న బిజెపి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల అనంతరం కనుమరుగవడం ఖాయం అన్నారు. కార్యకర్తలు, ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అమ్య నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, ముద్రబోయిన వెంకన్న, గోవర్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love