మృత్యు పరిహాసం

మృత్యు పరిహాసంఅటు పల్లె.. ఇటు పట్నమూ కాని ఆ ఊరిలో శంకరయ్య అతి సామాన్య ఉద్యోగి. ఒక ప్రయివేటు కాన్వెంట్‌లో మ్యాథ్స్‌ టీచర్‌. ప్రభుత్వ టీచర్‌ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నించిన ప్రతిసారీ అవకాశం తటిలో జారిపోయేది.
‘జాబ్‌’ అనేది శంకరయ్యకు అవసరం. ఎందుకంటే, అతను సగటు జీవి కనుక.. దిగువ మధ్య తరగతి జీవి అయిన శంకరయ్యకు అదే స్థాయిలో గల మేనమామ కూతురు పల్లవి సహచరి అయింది.
ఇక గవర్నమెంట్‌ జాబ్‌కు ప్రయత్నించడం వధా ప్రయాసగా భావించి, ఆ ఊరిలోనే కొద్దిగా పేరెన్నిక కలిగిన కాన్వెంట్‌లో మాథ్స్‌ టీచర్‌గా చేరాడు. ఆ కాన్వెంట్‌ వ్యవస్థాపకుడు అచ్యుతరావు సైతం ప్రభుత్వ ఉద్యోగానికి వెదకి వేసారి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కాన్వెంట్‌ స్థాపించాడు. ముందుగా నర్సరీతో కొద్దిమంది పిల్లలతో ప్రారంభించి, ప్రతి ఏటా తరగతులు పెంచుకుంటూ, అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. ఈ రోజు ‘అచ్యుత్‌ కాన్వెంట్‌’ అంటే ఒక విధమైన గుర్తింపు ఆ ఊరిలో. రిజల్ట్స్‌ బాగా ఉంటాయి అనే పేరు రావడంతో ఆ కాన్వెంట్‌కు విద్యార్థుల తాకిడి బాగానే పెరిగింది.
అందుకే, అచ్యుతరావు గుండె మీద చేయి వేసుకుని నిట్టూరుస్తుంటాడు అప్పుడప్పుడు. తనకు గవర్నమెంట్‌ జాబ్‌ రాకుండా భగవంతుడు చాలా మేలు చేశాడని. ఎందుకంటే, ఆ కాన్వెంట్‌ మీద అతడు బాగా సంపాదిస్తున్నాడు.
సోకాల్డ్‌ సొసైటీలో విద్యకు మించిన వ్యాపారం లేదని అచ్యుతరావు వంటి వ్యక్తులు సమాజానికి చాటుతుంటారు. కాన్వెంట్‌ సంస్కతి కొత్తగా ప్రవేశిస్తున్న ఆ రోజుల్లో అచ్యుతరావు వేసిన అడుగు ఈ రోజు అతని ఎదుగుదలకు దష్టాంతంగా నిలిచింది.
క్వాలిఫైడ్‌ స్టాఫ్‌ను నియమించుకుని, మంచి జీతాలు ఇస్తూ కాన్వెంట్‌ పేరు ఎక్కడా చెడిపోకుండా చూసుకుంటూ మానవత్వం నిండిన మంచి మనిషిగా ఆ స్టాఫ్‌లో పేరు తెచ్చుకున్నాడు అచ్యుతరావు.
శంకరయ్య తన బయోడేటాను సమర్పించినప్పుడు ఆశ్చర్యంగా అడిగాడు అచ్యుతరావు.
”వండర్‌.. మీరు గవర్నమెంట్‌ జాబ్‌కు ట్రై చేయలేదా?” అని.
తల వంచుకున్నాడు శంకరయ్య.
అర్థం చేసుకున్న అచ్యుతరావుకు దశాబ్దం కిందటి తన గతం గుర్తుకు వచ్చింది.
”ప్చ్‌.. తల వంచుకోవలసింది మీరు కాదు శంకరయ్య గారూ.. మీ వంటి మేధావిని అక్కున చేర్చుకోని ప్రభుత్వం సిగ్గు పడాలి” ఊరడించాడు.
”ఎన్ని ఉన్నా రాత ఉండాలి కదా సార్‌..” నిస్సహాయంగా పైకి చూస్తూ చెప్పాడు శంకరయ్య.
”అంతేలే మరి.. అలా అనుకోకపోతే తప్తి ఉండదు. ఎనీహౌ.. మీ వంటి వ్యక్తిని ఈ సంస్థ వదలుకోదు. వెంటనే జాయిన్‌ అవ్వండి” బయోడేటా మీద ఏదో రాస్తూ చెప్పాడు అచ్యుతరావు.
”థాంక్స్‌ సార్‌.. ఈ పరిస్థితుల్లో నాకు ఈ అవకాశం రావడం నా అదష్టంగా భావిస్తున్నాను” ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు శంకరయ్య.

‘అచ్యుత్‌ కాన్వెంట్‌’ లో చేరినప్పటి నుంచి తాను అటెండ్‌ అయ్యే క్లాస్‌ పిల్లల పట్ల చాలా శ్రద్ధ చూపసాగాడు శంకరయ్య. సహజంగా మాథ్స్‌ సబ్జెక్టు అంటే పిల్లలకు ఎంతో బెరుకు. ఆ బెరుకును పోగొట్టడానికి అతడు చేసిన ప్రయత్నం చాలావరకు ఫలించింది. విద్యార్థులను మానసికంగా తన వైపు తిప్పుకోడానికి తనకు తెలిసిన టెక్నిక్స్‌ అన్నీ ఉపయోగించాడు.
ఇప్పుడు లెక్కల క్లాస్‌ అంటే పిల్లలకు చాలా ప్రీతి. అందులోనూ శంకరయ్య సార్‌ వస్తున్నారంటే వారిలో ఎంతో ఉత్తేజం.. ఉల్లాసం..
ఒకరోజు శంకరయ్యను తన ఛాంబర్‌కు పిలిపించాడు అచ్యుతరావు.
”శంకరయ్య గారూ! మీ టీచింగ్‌ను గమనించాను. ఎక్సలెంట్‌.. ఇంటర్‌ విద్యకు, ఆ తర్వాత ఎంసెట్‌కు ప్రిపేర్‌ కావడానికి బీజం ఇప్పుడే వేయాలి. అలాగే, ఫిజిక్స్‌ క్లాసెస్‌కు అటెండ్‌ కాగలరా? ఆ సబ్జెక్టులో కూడా చాలామంది వీక్‌గా ఉన్నారు. భవిష్యత్తులో మాథ్స్‌, ఫిజిక్స్‌ .. ఈ రెండూ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్స్‌. కాకపోతే, మీరు కొద్దిగా ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. అదే ఆలోచిస్తున్నాను..” చెప్తూ ఆగి, మరల అతనే అన్నాడు.
”మీ కష్టం వధా పోదు. శాలరీ పెంచుతాను. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు..”
ప్రస్తుతం శంకరయ్య ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే! పైగా, తన ఏకైక కొడుకును కాన్వెంట్‌లో చేర్పించే సమయం ఆసన్నమైంది. పల్లవి ప్రైవేట్‌గా డిగ్రీ చదువుతోంది. ఆమెకు పుట్టింటి ద్వారా సంక్రమించిన ఆ చిన్నపాటి గహం ఉండటం వలన ‘కిరాయి’ బాధ లేదేమో గానీ, ఇంకా ఇతర ఖర్చులు చాలా ఉన్నాయి.
కష్టపడితేనే ఫలితం ఉంటుంది. పైగా, తను ఇంటి వద్ద ట్యూషన్లు కూడా చెప్పుదామని అనుకుంటున్నాడు. భవిష్యత్తు కోసం.. తప్పదు మరి.
అచ్యుతరావు ప్రపోజల్స్‌కు సంతోషంగా అంగీకరించాడు శంకరయ్య.
”శంకరయ్య గారూ! చాలామంది తమ పిల్లలకు ట్యూషన్లు చెప్పించమంటున్నారు. మీరు ఇంటివద్ద రోజూ రెండు మూడు గంటలు కేటాయించ గలరనుకుంటే నేను మీ పేరును సజేస్ట్‌ చేస్తాను” అచ్యుతరావు తన మీద చాలా బరువు బాధ్యతలను ఉంచుతాడనిపించింది శంకరయ్యకు.
శంకరయ్యకు ప్రస్తుతం డబ్బు అవసరం చాలా ఉంది.
అతనికి తెలిసిన విద్య టీచింగ్‌నే! పేరుకే మాథ్స్‌ టీచర్‌ అయినా, ఫిజిక్స్‌లో కూడా ప్రావీణ్యం బాగానే ఉంది. అందుకే ఆ రెండు సబ్జెక్టులు కావాలని వచ్చిన వారికి ట్యూషన్‌ చెప్పడం ప్రారంభించాడు. అతని వద్ద ట్యూషన్‌ తీసుకున్న వారికి టాప్‌ మార్కులు వచ్చాయి. ఆ విధంగా శంకరయ్యకు విద్యార్థుల కుటుంబాల్లో ఎనలేని ప్రాధాన్యత కలిగింది.
పైగా, కార్పొరేట్‌ కాలేజీల్లో ఫ్రీ సీట్‌ పొందిన వారు, కన్సెషన్‌ పొందిన వారు తరచూ ఫోన్లు చేయసాగారు.
”మాష్టారూ! మీ గైడెన్స్‌ వల్లనే మేం ఈ స్థాయికి వచ్చాం. ఇదే స్ఫూర్తితో ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించగలమనే నమ్మకం కలిగింది..” అంటూ…
శంకరయ్యకు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తిగతంగా కతజ్ఞతలు తెలుపుతుంటే ఎంతో ‘గర్వం’గా అనిపించింది.
ఈ జీవితానికి ఇంకేం కావాలి? తన వద్ద తర్ఫీదు పొందిన వారి భవిష్యత్తు బాగు పడుతుంటే అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది?
కొద్ది సంవత్సరాలలోనే శంకరయ్య ఆర్ధికంగా బాగానే సెటిలయ్యాడు. ఊరికు కొద్దిదూరంలో రెండు ప్లాట్స్‌ కూడా కొనుకున్నాడు. ఇది ఇలా ఉండగా డిగ్రీ పూర్తి చేసిన పల్లవి ఒక ప్రభుత్వ సంస్థలో ఔట్‌ సోర్సింగ్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా జాబ్‌ వచ్చింది. శంకరయ్య కుమారుడిని అచ్యుత్‌ కాన్వెంట్‌లోనే ఫీజు లేకుండా చేర్చుకున్నాడు అచ్యుతరావు.
అంతా సవ్యంగా జరిగితే అది విధి ఓటమినే కదా!
ఒక రాత్రి హఠాత్తుగా పల్లవి నుంచి కాల్‌ అందుకున్న అచ్యుతరావు వెంటనే శంకరయ్య ఇంటికి చేరుకున్నాడు.
అతను వెళ్ళేసరికి జరగకూడనిది జరిగి పోయింది.
అక్కడ.. శంకరయ్య నిర్జీవ దేహం…
సడెన్‌గా వచ్చిన హార్ట్‌ ఎటాక్‌ అతడిని బలి తీసుకుంది.
హాస్పిటల్‌కు తీసుకెళ్ళే సమయం కూడా లేకుండా పోయింది.

శంకరయ్య అంత్యక్రియలు చాలా ఘనంగా జరిగాయి.
ఎందరో విద్యార్థులు తమ మాస్టారి మరణ వార్త విని కన్నీటి పర్యంతం అయ్యారు. అతని కడసారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు.
శంకరయ్య మాష్టారికున్న మంచి పేరు వలన, అతని వల్ల ఎందరో విద్యార్థుల భవిష్యత్తు బాగు పడటం వలన.. ఆ ప్రాంతం జన సందోహంగా మారిపోయింది.
అన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు సంతాప సూచికంగా సెలవు ప్రకటించాయి.

శంకరయ్య సంతాప సభ..
ఆ ఊరిలోని అన్ని కాన్వెంట్‌ల నుంచి యాజమాన్యాలు, విద్యార్థులు, ఇంకా పూర్వ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం వలన హాలు కిక్కిరిసిపోయింది.
శంకరయ్య ఫొటోకు ఎన్నో దండలు..
ఆ సభకు ఆ జిల్లాలోనే పేరెన్నికగన్న పారిశ్రామికవేత్త సత్యేంద్ర దాసు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అతనికి ప్రభుత్వ వర్గాల్లో పలుకుబడి అపారంగా ఉంది. రాజకీయంగా కూడా చాలా మంది అనుచరులు ఉన్నారు. ఎంతో సంపద, తోటలు, బంగళాలు అనంతంగా ఉన్నాయి.
ఈ సభకు సత్యేంద్ర దాసు రావడానికి బలమైన కారణం ఉంది. ఈ సంతాప సభను మునుముందు తన రాజకీయానికి కూడా వాడుకోవచ్చు అనేది అతని ఆలోచన.
శంకరయ్య గురించి తన పి.ఏ ద్వారా సమస్తం తెలుసుకున్నాడు. ఒక మంచి ఉపన్యాసాన్ని తయారు చేయించాడు. శంకరయ్యతో అతనికి పరిచయం లేకపోయినా, అతను ప్రసంగించే విధానం అందరినీ ఆకట్టుకుంది.
శంకరయ్య అంత్యక్రియలు ఇంత ఘనంగా జరగటం అతనికి కొద్దిగా అసూయగానే ఉంది. అలా అనుకుంటే తను మరణించాక, నలుగురు కొడుకులు, బంధు గణం, వందలాది అనుచరులు, నివాళుల రూపంలో పేపర్‌ ప్రకటనలు.. ఓ.. తన చావు అనంతరం జరిగేది ఊహించుకున్నాడు.

మూడు నెలల అనంతరం.
ప్రపంచం అతలాకుతలం అయింది.
ఎవరికీ అంతుపట్టని సూక్ష్మజీవి కోటానుకోట్ల ప్రజలను వణికించసాగింది. జన జీవనం మీద ప్రభావం చూపిన ఈ వైరస్‌ గురించి పాలకులు తలలు పట్టుకున్నారు.
జనం అనామక చావులు కుటుంబాలను భయ బ్రాంతులను చేశాయి. కడసారి చూపుకు కూడా నోచుకోని దౌర్భాగ్యపు దినాల పదఘట్టనల కింద తరతమ భేదాలు లేకుండా చితికిపోతోంది మానవజాతి.
అటువంటి దుర్థినాల్లో ఒక వార్త ఆ జిల్లా ప్రజలలో సంచలనం రేపింది. ఇటువంటి వార్తలు గంట గంటకు వింటోన్నా అత్యంత ప్రముఖుడు కనుక మీడియా కూడా సహజంగానే అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది.
‘ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ దిగ్గజం సత్యేంద్ర దాసుకు కరోనా పాజిటివ్‌’.
జీవితంలో తొలిసారి భయపడ్డాడతను. ఏదో దుశ్శకునం… ప్రతిరోజూ కరోనా మరణాలు ఎలా సంభవిస్తున్నాయో వింటున్నాడు అతను.
మరి తనకు….!?
మాస్క్‌ ధరిస్తున్నా, చేతుల పరిశుభ్రత పాటిస్తున్నా, డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేస్తున్నా.. ఈ వ్యాధి బారిన పడటం..
వెంటనే అంబులెన్స్‌లో అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. ఇంటిల్లిపాదికీ, ఆయన సన్నిహితులకు అందరికీ కొవిడ్‌ టెస్టులు జరిగాయి.
ఇక బెడ్‌ మీద సత్యేంద్ర దాసు పరిస్థితి..
అతనికి శ్వాస అందటం లేదు. వెంటిలేటర్‌ అమర్చారు. నరకప్రాయంగా ఉంది. సాధారణ తల నొప్పికే చుట్టూ మూగే బంధు మిత్రులు, సకల పరివారం ఇప్పుడేరి?
కోటానుకోట్ల సంపదను పోగు చేశాడు. ఆ సంపదను అనుభవిస్తున్న పుత్రరత్నాలు కనుచూపు మేర కూడా కనిపించడం లేదు.
భగవాన్‌! ఏం పాపం చేసాను? ఇంతటి మహమ్మారి వ్యాధినా ఇది!
కరోనా పేషంట్లను ఎవరూ తాకరు. కనీసం ఆమడ దూరం నుంచి కూడా చూడరు.
ఇంత బతుకూ బతికి… సత్యేంద్ర దాసుకు ఏవేవో పీడ కలలు…
దురదష్ట వశాత్తూ కరోనా వలన మతి చెందితే, ఆ మత దేహాన్ని వారి ఇంటికి తీసుకు వెళ్లరు. స్మశానంలో కూడా అంత తేలికగా ప్రవేశం ఉండదు. ఆ దేహాన్ని కనీసం చేతులతో మోయరు. అయినవారు సైతం కడసారి చూపు చూడరు.
అనాధ శవాన్నయినా నలుగురు మోస్తారు.. ఇది ఎంతో ఘోరమైన చావు. వయస్సు మీద పడటం వలన రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది అతనికి.
దూరం నుంచే ఒంటినిండా కిట్స్‌ ధరించిన వైద్యులు భయం భయంగా ట్రీట్‌ మెంట్‌ చేస్తున్నారు.
అంతా భయం.. భయం.. సందేహం…
సత్యేంద్ర దాసు భయం నిజంగా నిజమైంది.
అతని కుటుంబ సభ్యులకు వర్తమానం వెళ్ళింది.
కరోనా మరణం కనుక వారు అశక్తత చూపారు. వారి కళ్ళల్లో నీళ్ళు..
అంతలోనే వేదాంతాన్ని ఆలవరచు కున్నారు.
విధి.. విధి.. విధి… రాత.. రాత.. రాత..
చివరకు సత్యేంద్ర దాసు మత దేహాన్ని ఒక మూట కట్టి స్ట్రెచ్చర్‌ మీద అంబులెన్స్‌ లోకి ఎక్కించారు. ఆ దేహాన్ని అప్పటికే పేర్చి ఉన్న చితి మీదకు విసరి వేశారు. పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు తల కొరివి పెట్టలేదు.

గంట తర్వాత టివిలో ఈ వార్త ప్రసారం అయింది.
ముగింపుగా…
శంకరయ్యకు గౌరవ మర్యాదలతో అంతిమ సంస్కారం చేసిన ఊరు అది.
లాక్‌ డౌన్‌ సడలించిన ఆ కొద్ది సేపటిలో బయటకు వచ్చారు జనం.
డిస్టెన్స్‌ పాటిస్తూ క్యూలో నిలబడ్డారు పచారీ సామాను దుకాణం ముందు.
‘ఎన్ని ఉంటేనేం.. సావు సక్రమంగా లేకపోతే..’ ఒక నిశాని నోటి నుంచి వెలువడిన మనోగతం అది. అది ఎవరి గురించో అందరూ ఊహించారు .
– పంతంగి శ్రీనివాస రావు
9182203351

Spread the love