నీటి పొదుపుతో ఎక్కువ సాగు చేయాలి

– ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నీటిని పొదుపు చేయడం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి సూచించారు. హైదరాబాద్‌ హిమయత్‌సాగర్‌లోని నీరు, భూ యాజమాన్య శిక్షణ, పరిశోధన సంస్థను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్‌ నరేందర్‌, ఇతర అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని నీటి పొదుపుగా వాడుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ సంస్థకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా, గత పదేండ్లుగా బీఆర్‌ఎస్‌ సర్కారు నయా పైసా ఇవ్వక పోవడంతో పరిశోధనలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రిటైర్డ్‌ అధికారులు బొమ్మిరెడ్డి కృపాకర్‌రెడ్డి, డాక్టర్‌ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Spread the love