4 వేలు దాటిన యాక్టీవ్‌ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుండి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 312 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,742 నుంచి 4,054కు పెరిగింది. అలాగే సబ్‌వేరియంట్‌ జెఎన్‌1 కేసుల సంఖ్య 63కు చేరుకుందని తెలిపింది. గోవాలో ఈ సబ్‌వేరియంట్‌ కేసులు అత్యధికంగా 34 కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో ఈ కేసులు 9 నమోదుకాగా, థానేలోనే 5 కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్‌ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో మొత్తం కేసుల్లో కేరళలో అత్యధికంగా 128 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. గత 24 గంటల్లో 315 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు చేరుకుంది.

Spread the love