– వణుకుతున్న ప్రజలు
– పట్టించుకోని అధికారులు
– డెంగ్యూ, మలేరియా వంటి
– ప్రాణాంతక వ్యాధులు ప్రభలే అవకాశం
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
వర్షాకాలం మొదలవడంతో పరిసరాలన్ని గడ్డి, చిన్న చిన్న మొక్కలతో పచ్చగా మారిపోయాయి. ధీంతో పాటే దోమలు కూడా విపరీతంగా పెరిగిపోయి మనుషుల మీద దండ యాత్ర చేస్తున్నాయి. వాటిని లార్వా దశలోనే నిర్ము లించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అవి మరింతగా వృద్ధి చెందాయి. శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని చందానగర్ సర్కిల్ మియాపూర్ డివిజన్‌లోని మక్త మహబూబ్‌పేట్ గ్రామంలో దోమలు వీర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. కొన్ని రోజులుగా దోమల బెడద ఎక్కువైందనీ, వీటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతం లో ఫిర్యాదు చేయగా ఒకసారి రెండు సార్లు ఫాగింగ్ చేశారని, మళ్ళీ నాలుగైదు నెలలుగా ఒక్కసారి కూడా ఫాగింగ్ చేయడం లేదని వాపోతున్నారు.
దోమల మందు పిచికారీ చేయాలి:-గ్రామస్తులు
మక్త గ్రామంలో దోమల నివారణకు దోమల మందు ను పిచికారీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వీధుల్లో, చెత్త వేసే ప్రాంతాల్లో, నీరు నిలువ ఉండే ప్రాంతా లు, చెరువు చుట్టూ దోమ నివారణకు స్ప్రే లు పిచికారీ చేయాలనీ కోరుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకో వడం లేదన్నారు.
వైరల్ ఫివర్‌లు వచ్చే అవకాశం
అసలే వర్షాకాలం కావడంతో సాధారణంగా వైరల్ ఫివర్‌లు వస్తుంటాయి. పైగా దోమలు ఎక్కువవ్వడంతో డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు.
గ్రామంలో గ్రామం చుట్టూ పక్కలా చెత్త కుప్పలు, మురికి నీటి ప్రవాహాలు ఉండడంతో పాటు, పిచ్చి మొక్క లు కూడా విపరీతంగా పెరిగాయని ఇవన్నీ దోమలు పెరగడానికి కారణమాయ్యాయని, వీటిని తొలిగించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. ఫాగింగ్‌తో పాటు, దోమల నివారణకు మందులను పిచికారీ చేయా లని వారు కోరుతున్నారు.