విద్యార్థినీలు కస్తూర్బాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 

గ్రామీణ ప్రాంత విద్యార్థినిలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థినిలకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులను తహసిల్దార్ ఆంజనేయులు, మండల విద్యాధికారి ఆంధ్రయ్యతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం మారుమూల విద్యార్థినిలకు కూడా ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించి విద్యార్థినిలు ఉన్నత స్థాయికి ఎదిగేటట్లు ఉపాధ్యాయునిలు శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థినిలు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకొని నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థినిలకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని నాన్ టీచింగ్ సిబ్బందితో వండించి అందించాలన్నారు. పాఠశాల ప్రారంభం రోజే బడికి వచ్చిన విద్యార్థినిలకు పరీక్ష అట్టలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిణి గంగామణి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Spread the love