యువకులు, చిన్నారులు, పెద్దల కోరిక మేరకు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ సూచించారు. ఇందల్ వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఐదు లక్షల రూపాయలు నిధులు, మండల పరిషత్ నుండి రూ.2 లక్షల రూపాయలు, మొత్తం ఏడు లక్షల రూపాయలతో నిర్మించిన ఓపెన్ జీమ్ ను జెడ్పీటీసీ సుమన రవి రెడ్డి తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ ల సహాయ సహకారాలతో కోట్లాది రూపాయలతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని, రెండు కోట్ల రూ.10 లక్షల రూపాయలతో సబ్ స్టేషన్ నిర్మాణం చివరి దశకు చేరుకుందన్నారు. అందరి సౌకర్యార్థం మండలంలోని ఏ గ్రామంలో లేకుండా చంద్రయాన్ పల్లిలోనే ఓపెన్ జిమ్ ను రహదారికి ఆనుకొని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిని ప్రజలు, తమ ఆరోగ్య సంరక్షణకు ఉపయోగించు కొని లబ్ది పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అరటి రఘు, సంజీవ్ రెడ్డి, మాజీ సర్పంచ్ పాశంకుమార్, మాజీ ఉపసర్పంచ్ ప్రకాష్, శ్రీధర్ గౌడ్, కార్యదర్శి రజని, ఏ ఎన్ ఎం సావిత్రి, ఉదయ, అంగన్వాడి టీచర్ మంజుల, కారోబార్ రాజా గౌడ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.