మ్యూజిక్‌ మేస్ట్రో రషీద్‌ ఖాన్‌ కన్నుమూత

న్యూఢిల్లీ : ప్రముఖ సంగీత విద్వాంసులు రషీద్‌ ఖాన్‌ బుధవారం తుది శ్వాస విడిచారు. 55 ఏళ్ల రషీద్‌ ఖాన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు కొల్‌కతాలోని ఒక ఆసుపత్రులోని చికిత్స పొందుతూ సాయంత్రం 3:45 గంటల సమయంలో మరణించారు. గత నెలలో సెరిబ్రల్‌ ఎటాక్‌కు గురైన సమయంలోనే రషీద్‌ ఖాన్‌ ఆరోగ్యం క్షీణించింది. తొలుత టాటా మెమోరియల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందిన రషీద్‌ ఖాన్‌ ఆ తరువాత కొల్‌కతా ఆసుపత్రిలో చేరారు. ఉత్తరప్రదేశ్‌లోని బదయున్‌లో జన్మించిన రషీద్‌.. సంగీతంలో ప్రాధమిక శిక్షణను ఉస్తాద్‌ నిస్సార్‌ హుస్సైన్‌ ఖాన్‌ వద్ద పొందారు. 1978లో 11 ఏళ్ల వయస్సులోనే రషీద్‌్‌ తొలి కచేరి ఇచ్చారు. 1980 ఏప్రిల్లో కొల్‌కతాలోని ఐటిసి సంగీత పరిశోధన అకాడమీలో చేరారు. శాస్త్రీయ హిందుస్థానీ సంగీతాన్ని సులభ స్వరాల్లో అభిమానులకు అందించడం రషీద్‌ ప్రత్యేకత. జుగల్బందీల్లోనూ పాల్గొనడం ఆయన బహుముఖ ప్రజ్ఞను వెల్లడిస్తుంది. పాశ్చాత్య వాయిద్యకారుడు లూయిస్‌ బ్యాంక్స్‌, ప్రముఖ సితార విద్వాంసుడు షాహిద్‌ పర్వేజ్‌తో సహా ఇతర ప్రముఖ సంగీత దిగ్గజాలతో కలిసి రషీద్‌ అనేక ప్రదర్శనలు ఇచ్చి సంగీతాభిమానులను అలరించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Spread the love