ప్రభుత్వ పథకాల అమలులో మెరుగైన స్థానంలో నల్లగొండ జిల్లా: కలెక్టర్

– జిల్లాకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ అధికారులు
– వారితో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్గొండ జిల్లాలో ఇంటింటికి తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, సెగ్రిగేషన్ షెడ్లనిర్వహణ, ఉపాధి హామీ అమలు వంటి పథకాలలో మెరుగైన స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన  తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్ కి చెందిన 26 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం  శిక్షణ కార్యక్రమంలో  భాగంగా నల్గొండ జిల్లాలో ప్రజల సామాజిక, ఆర్థిక  అంశాల అధ్యయన నిమిత్తం జిల్లాకు రాగా, సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్  వారితో ముఖాముఖి మాట్లాడారు. నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని, పట్టణ ప్రాంతాలు మొదలుకొని గ్రామీణ ప్రాంతాలలో సైతం నల్ల కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో చెత్తను వేరు చేసే షెడ్ల నిర్మాణాన్ని చేపట్టామని, ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి ఊరి బయట సెక్రిగేషన్ షెడ్ ద్వారా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తున్నట్లు వారికి తెలియజేశారు. వ్యవసాయంలో భాగంగా విత్తనాల సరఫరా, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ శాఖ ద్వారా అందించే విధానాన్ని వివరించారు.విద్యకు సంబంధించి పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీల ద్వారా పాఠశాలలో  మరమ్మత్తు పనులతో పాటు, ఇతర నిర్మాణ పనులు,పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతున్నదని, వీరి ద్వారానే పనులు జరుగుతాయని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద జియో ట్యాగింగ్ ద్వారా పనుల గుర్తింపు, మస్టర్ నమోదు  అన్నింటిని ఆన్లైన్లో పరిశీలించుకోవచ్చని, నూటికి నూరు శాతం డిజిటలైజేషన్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. శానిటేషన్ లో భాగంగా గ్రామాలలో నూటికి 110 శాతం పురోగతి ఉందని, కొన్ని గ్రామాలలో ఒక్క  గృహంలో  రెండు టాయిలెట్ల సైతం ఉన్నాయని, ప్రతి ఇల్లు చెత్తను సేకరించి గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ తో పాటు, చెత్తను వేరుచేసేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు.
24 వరకు జిల్లాలు పర్యటన..
కాగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల బృందం ఏప్రిల్ 8 నుండి జూన్ 7 వరకు హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ నిమిత్తం రాగా, నల్గొండ జిల్లా లో ప్రజల జీవన పరిస్థితుల అధ్యయనం నిమిత్తం ఈనెల 20 నుండి 24 వరకు జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాలలో పర్యటించనున్నారు. నల్గొండ మండలం అన్నే పర్తి, మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్, దామరచర్ల మండలం వాడపల్లి, చిట్యాల మండలం ఊరుమడ్ల, మునుగోడు మండలం పలివేల గ్రామాలలో అక్కడి ప్రజల జీవన పరిస్థితులు, సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు అక్కడే బస చేయనున్నారు. కాగా ఈ బృందానికి నోడల్ అధికారిగా డిఆర్డిఓ నాగిరెడ్డి వ్యవహరించనున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర, డిఆర్డిఏ పిడి  నాగిరెడ్డి, తదితరులు హాజరయ్యారు.అనంతరం ఈ బృందం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికలు, శాసనమండలి  పట్టభద్రుల ఉపఎన్నిక సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కేంద్రాన్ని  సందర్శించగా, ఎంసిఎంసి నోడల్ అధికారి సమాచార సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు వారికి ఎన్నికల సందర్భంగా  ఎంసి ఎంసి విధులు, బాధ్యతలను తెలియజేశారు.
Spread the love