నవతెలంగాణ – పెద్దవంగర
మూర్ఛ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు టీచర్స్ ప్రధాన కార్యదర్శి వెలిదె సురేష్ కుమార్ అన్నారు. గురువారం వడ్డెకొత్తపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంశపారంపర్యంగా, అధిక మద్యపానం, ధూమపానం వల్ల, తలకు బలమైన గాయాలు కావడం, అధిక మానసిక ఒత్తిడి వల్ల, నిద్రలేమి కారణంగా, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల, మెదడులోని నరాలు దెబ్బతిని మూర్చ వ్యాధి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మూర్ఛ వ్యాధిని నివారించవచ్చునని అన్నారు. మూర్చ వ్యాధి బారిన పడిన వారిని సామాజిక బహిష్కరణ చేయకుండా, వారికి తగిన వైద్యాన్ని అందించాలని, మూఢనమ్మకాలు విడనాడాలి సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ, శ్రీధర్, దయాకర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.