న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండిసి విదేశాల్లో కీలక ఖనిజాల (క్రిటికల్ మినరల్స్) అన్వేషణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అర్జెంటీనాలోని రాగి నిక్షేపాలు అత్యధికంగా లభించే ప్రాంతాలపై ఆ సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారించింది. భవిష్యత్తులో దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు గ్లోబల్ మార్కెట్‌లో పట్టు సాధించే దిశగా అర్జెంటీనాలోని ఆరు అత్యంత ఖనిజ సంపద కలిగిన ప్రావిన్సుల అధికారులతో ఎన్‌ఎండిసి ఉన్నత స్థాయి చర్చలు జరుపుతోంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ముడి ఖనిజాల దిగుమతికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కేవలం రాగి మాత్రమే కాకుండా లిథియం, భూసార ఖనిజాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్), భవిష్యత్ టెక్నాలజీ రంగానికి అత్యంత కీలకమైన ఇతర వ్యూహాత్మక ఖనిజాలను వెలికితీసే దిశగా ఎన్‌ఎండిసి తన విదేశీ వ్యూహాన్ని విస్తరిస్తోంది. గ్రీన్ ఎనర్జీ రంగానికి మారుతున్న మనుగడ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల కొరతను నివారించడమే లక్ష్యంగా ఈ ముందడుగు వేసింది. అర్జెంటీనా ప్రభుత్వంతో కుదిరే ఒప్పందాలు ఇరు దేశాల మధ్య పారిశ్రామిక సంబంధాలను మరింత బలపరుస్తాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న రోజుల్లో జరిగే అధికారిక ఒప్పందాలు ఖరారైతే దేశీయ మైనింగ్ రంగ చరిత్రలో ఎన్‌ఎండిసి విదేశీ విస్తరణ మరో మైలురాయిగా నిలవనుంది.



