విధులు లేవు.. నిధులు నిల్‌..

– ఐదేండ్ల పదవీ కాలంపై తీవ్ర నిరుత్సాహం
– పేరుకే పరిమితమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీలు
– పదవులు నామమాత్రంగా మారాయని ఆవేదన
నవతెలంగాణ-సిరికొండ
ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేసి, ఐదేండ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకే నిధులు లేవు. పేరుకే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కానీ విధులు లేవు.. నిధుల్లేవ్‌.. అంతకన్నా ముఖ్యం ప్రాధాన్యతా లేదు. ప్రజాప్రతినిధులు అన్నమాట తప్ప ఎందుకు పనికి రాకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగులుతున్నామని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేండ్ల కాలంలో ఇది ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గోడు..
ఆవేదనలో ఎంపీటీసీలు
ఎంపీటీసీ సభ్యులకు గత పదేండ్లలో వారికి వచ్చింది. కేవలం రూ.2లక్షల లోపు మాత్రమే. వీటితో గ్రామాల్లో ఏమీ అభివృద్ధి చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. సిరికొండ మండలంలో ఆరు ఎంపీటీసీ స్థానాలు ఉండగా వారిలో ఎక్కువమంది ఆర్థికంగా వెనుకబడిన వారే ఉన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎంపీటీసీలపై చిత్తశుద్ధి చూపించాలి. నిధులు మంజూరు చేయాలి.
పేరుకే ప్రజాప్రతినిధులు
పరిషత్‌ ఎన్నికలు జరిగి ఐదేండ్లు పూర్తికావస్తుంది. గతంలో జెడ్పీటీసీల ద్వారా గ్రామాలకు నిధులు అందేవి. కానీ 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు జెడ్పీటీసీల ద్వారా కాకుండా జీపీలకు చేరుతుండటంతో పరిషత్తుల పాత్ర ప్రాధాన్యం కోల్పోయింది. ప్రస్తుత విధానంలో ఆర్థిక సంఘం ద్వారా 80శాతం నిధులు గ్రామపంచాయతీలకు మండల పరిషత్‌లకు 15శాతం జిల్లా పరిషత్‌లకు ఐదు శాతం లెక్కన కేటాయింపులు జరిగాయి. ఈ లెక్కన ఒక్కో జెడ్పీటీసీకి ఏడాదికి ఐదు నుంచి పది లక్షలు రావాల్సి ఉంది. కానీ ఆ విధంగా నిధులు అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎంపీటీసీ సభ్యులకు 15వ ఆర్థిక సంఘం స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా నిధులు మంజూరు చేశారు. అయినప్పటికీ వారికి ఆశించిన నిధులు రావడంలేదని అసంతృప్తితో రగులుతున్నారు.

గ్రామాల అభివృద్ధిలో ఎంపీటీసీలను భాగస్వామ్యం చేయాలి
సూర్యకాంత్‌ ఎంపీటీసీ సొంపల్లి
ఎంపీటీసీగా గెలిచి ఐదేండ్లు పూర్తి కావచ్చింది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిధులు లేవు. ఎంపీటీసీగా గెలిచినందుకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా.. ఎంపీటీసీ పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. పరిషత్‌ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి ఎంపీటీసీలను భాగస్వామ్యం చేయాలి.

ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి
పర్వీన్‌ లతీఫ్‌ ఎంపీటీసీ సిరికొండ
ఎంపీటీసీలకు పంచాయతీ సర్పంచులతో పాటు సమానంగా నిధులు ఇవ్వాలి. తమకు ఇచ్చే అరకొర నిధులతో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. ఎంపీటీసీలను నిర్వీర్యం చేసే విధంగా ఉంది. పంచాయతీ నిధులతో పాటు, ఎంపీటీసీ నిధులు కలిస్తే గ్రామాలు బాగుపడతాయి. తమ పదవీకాలం పూర్తయ్యాక పెన్షన్‌ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి.

ఉత్సవ విగ్రహాలమా..?
మారుతి వాయిపేట్‌ ఎంపీటీసీ
గత ప్రభుత్వం ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా చూసింది. కనీసం ప్రోటోకాల్‌ కూడా పాటించలేదు. నిధులు లేవ్‌.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎంపీటీసీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో అందించాలి.

Spread the love