బజరంగ్‌ పునియాపై మరోసారి సస్పెన్షన్‌ వేటు..!

నవతెలంగాణ హైదరాబాద్: రెజ్లింగ్‌లో ఒలింపిక్‌ పతక విజేత బజరంగ్‌ పునియాపై మరోసారి సస్పెన్షన్‌ వేటు పడింది. డోపింగ్‌ పరీక్షకు శాంపిల్‌ ఇవ్వని కారణంగా ఆయన్ను ‘నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ’ తాజాగా సస్పెండ్‌ చేసింది. నెల క్రితమే ఆయనపై తొలిసారి వేటువేయగా.. ముందస్తు నోటీసులు జారీ చేయని కారణంగా దాన్ని క్రమశిక్షణ సంఘం ఎత్తివేసింది. అనంతరం నోటీసులు ఇచ్చిన నాడా తాజాగా చర్యలకు ఉపక్రమించింది. దీంతో త్వరలో జరగబోయే ఒలింపిక్స్ పోటీల్లో ఆయన పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకొన్నాయి. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు దేశీయంగా నాడా డోపింగ్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందుకోసం మార్చి 10న బజరంగ్‌ పునియా నుంచి మూత్ర నమూనాలను కోరింది. కానీ, ఆయన మాత్రం ఆ శాంపిల్‌ను అందించలేదని తెలిపింది. దీంతో నిబంధనలను ఉల్లంఘించినట్లుగా పేర్కొంటూ సస్పెన్షన్‌ వేటు వేసింది. జులై 11లోగా స్పందించాలని ఆదేశించింది.
నాడా కాలంచెల్లిన డోపింగ్‌ పరీక్ష కిట్లను ఉపయోగిస్తోందని పునియా గతంలో ఆరోపించారు. దీనిపై ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదన్నారు. వివరణ రానందునే తాను నమూనాలు ఇవ్వలేదని తెలిపారు. మరోవైపు నమూనాలు ఇవ్వని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినప్పటికీ.. పునియా అలాగే వెళ్లిపోయారని నాడా అధికారులు ఆరోపించారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన ప్రముఖ రెజ్లర్లు.. ఆయనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో గతంలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. బజరంగ్‌ పునియాతో పాటు రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగట్‌లు చేసిన పోరాటం ఫలితంగా బ్రిజ్‌ భూషణ్‌పై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది.

Spread the love