– మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
నవతెలంగాణ-నస్పూర్
సింగరేణి బొగ్గు బ్లాక్‌లను వేలం వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తోడుదొంగలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి అన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలానికి వ్యతిరేకంగా శనివారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. సింగరేణి సంస్థ గత 135 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, దేశ అవసరాలకు అనుగుణంగా, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బొగ్గు వెలికితీస్తు లాభాల బాటలో పయనిస్తుందన్నారు. సింగరేణి డబ్బుతో కొత్త బ్లాక్ లను కనుగొని అనుమతుల కోసం కేంద్రానికి నివేదికను పంపిస్తే, ఆ బ్లాక్లను వేలం వేయడం అమానుషమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర సంయుక్త కార్యదర్శి సత్తయ్య, కేంద్ర చీప్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పోగాకు రమేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ అన్వేష్ రెడ్డి, కౌన్సిలర్లు ఈసంపల్లి ప్రభాకర్, వంగ తిరుపతి, నస్పూర్ మండల కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, రాజేంద్రపాణి, రఫిక్ ఖాన్ పాల్గొన్నారు.