మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షంలో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భీంగల్ ఐసిడిఎస్ ఏసిడిపిఓ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ గర్భిణీలు,బాలింతలు ఆకుకూరలు, చిరుధాన్యాలు తీసుకోవాలని, తద్వారా పౌష్టికాహారం లభించి ఆరోగ్యంగా ఉంటారన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భం దాల్చిన నుండి పిల్లలు పుట్టిన రెండు సంవత్సరాల వరకు ఈ 1000 రోజుల్లో బరువు ఎక్కువ పెరుగుతారన్నారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.తల్లులు తమ పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో లభించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పిల్లలు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. పోషకాహారం పై పలు సలహాలు సూచనలు తెలిపారు. అనంతరం పోషణ పక్వాడ్ జనాందోళన డ్యాష్ బోర్డులో కార్యక్రమాల ఫోటోలను అప్లోడ్ చేయడంపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ మండల పర్యవేక్షకురాలు గంగా హంస, అంగన్వాడీ టీచర్ అనిత, తల్లులు పాల్గొన్నారు.