
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఉద్యోగ, పెన్షనర్ల, జర్నలిస్టుల అవుట్ పేషంట్ ( ఓపి) సేవల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ నందు గత వారం రోజులుగా మందులు ఇచ్చేందుకు సరైన సిబ్బంది లేక అనేక ఇబ్బందులు గురవుతున్నామని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఓపి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫార్మసిస్టులు లేక మందులు ఇవ్వలేదు. ఇంటర్నెట్ సేవలు లేవని, పవర్ లేదని, సరిపడా ఫార్మసిస్టులు అందుబాటులో లేరని తదితర కారణాలతో పెన్షనర్లకు మందులు ఇచ్చేందుకు గత వారం రోజులుగా లబ్ధి దారులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 25 మంది సిబ్బంది ఈ వెల్నెస్ సెంటర్లో ఉన్న కూడా ఈ పరిస్థితి ఉండటం దారుణమని ఆయన అన్నారు. కామారెడ్డి తదితర సుదూర ప్రాంతాల నుండి వచ్చిన సీనియర్ సిటిజెన్లు గత వారం రోజులుగా అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ఫార్మసీ సిబ్బందిని అందుబాటులోకి తీసుకొచ్చి వెల్నెస్ సెంటర్ పనితీరును మెరుగుపరచాలని ఆయన జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈరోజు 200 మందికి పైగా సీనియర్ సిటిజనులు గంటల తరబడి వెల్నెస్ సెంటర్ నందు పడిగాపులు కాసి వెనుతిరిగి పోయారని ఆయన అన్నారు.