సమంత హార్వేకు బుకర్‌ ప్రైజ్‌ అందించిన ‘ఆర్బిటల్‌’

Bernardine Evaristo, Margaret Atwood”భూమి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష నౌకలో వాళ్లంతా ఒక్కచోటే కలిసివున్నారు. ఐనా వారి మనసు లోపల ఒంటరిగానే వున్న భావన. వారి ఆలోచనలు, అంతర్లోకాలు విడిపోతునట్లు, కొన్నిసార్లు ఏకమవుతున్నట్లు వారి స్వప్నాల్లో సారూప్యత, అంతలోనే వైరుధ్యాలు, అనంతమైన చీకటి, అంతలోనే శక్తివంతమైన వెలుగు, సున్నితత్వం లేని అంతరిక్షం, సరళమనుకున్న అనంతత్వలో విశ్వాన్ని ఆవిష్కరించాలనే లక్ష్యంతో వారి వారి స్లీపింగ్‌ బ్యాగ్స్‌ నుండి మరో ఉదయంలోకి మేల్కొంటున్న వ్యోమగాముల కార్యాచరణ ప్రారంభం – ”భూమి మీద పాఠకుడి చేతిలో వున్న హార్వే ‘ఆర్బిటల్‌’ నవలా పఠనం ప్రారంభం.
సమంత హార్వే- తెలుగు సాహిత్య రంగానికి అంతగా పరిచయం లేని పేరు. ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత్రి . ఈమె రాసిన ‘ఆర్బిటల్‌’ నవల 2024 సంవత్సరానికి బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకోవడంతో సమంత హార్వే పేరు నవలా సాహిత్య రంగంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆర్బిటల్‌ నవల వైజ్ఞానిక కాల్పనిక సాహిత్య సమ్మేళనాల ప్రతిబింబం. తాత్విక యవనిక పై సాగే ఈ నవల ఆరుగురు వ్యోమగాముల అంతరిక్షయాన విశేషాలు, వారి భావోద్వేగాలు, మానసిక స్థితి, వైయక్తిక అనుభవాలను రంగరించి రచయిత్రి ఆసక్తికరంగా కథను నడిపిస్తుంది. 136 పేజీల ఈ నవలను 2023 నవంబర్‌లో యుకె లోని Jonathan Cape సంస్థ ప్రచురించగా, అదే సంవత్సరం 2023 డిసెంబర్‌లో యుఎస్‌లోని Groove Atlantic సంస్థ ప్రచురించింది.
నేపథ్యం: నవల రచన ప్రారంభంలో హార్వే, భూమి అంతరిక్ష నౌక కేంద్రం, స్పేస్‌కు సంబంధించిన విషయాలపై ఆసక్తికరంగా అధ్యయనం చేసింది. ఈ నవలను 2010లో ప్రారంభించి కొంతవరకు రాసి సంబంధిత నవలా వస్తువుపై తనకు సరియైన అవగాహన, విషయ పరిజ్ఞానం లేదన్న భావం కలిగి రచనను అక్కడే ఆపేసింది. క్లిష్టమైన వస్తువు, అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి పరిమితమైన జ్ఞానం అన్న ఆలోచన ఆమె నిర్ణయానికి కారణమైంది. ‘ఎన్నడూ తను అంతరిక్ష నౌకలో ప్రయాణం చేయలేదు, అలాంటప్పుడు ఈ విషయం మీద నవల రాయడానికి తనకున్న అర్హత ఏమిటి’ అనే భావన ఆమె రచనను నియంత్రించింది. తిరిగి హార్వే 2020, కోవిడ్‌ – 19 విస్తరించిన కాలంలో ఈ నవలను పూర్తి చేసింది.
నవల సారాంశం: ఈ నవల 24 గంటల కాలపరిధిలో అంతరిక్ష నౌకలో ప్రయాణించిన జపాన్‌, యుఎస్‌, బ్రిటన్‌, ఇటలీ, రష్యాకు చెందిన ఆరుగురు వ్యోమగాముల అనుభవాలు వ్యక్తీకరించబడ్డాయి. అందులో నలుగురు పురుషులు కాగా ఇద్దరు మహిళలు వుంటారు. జపాన్‌కు చెందిన ‘ఛే (Chie) ‘బ్రిటన్‌ వ్యోమగామి ‘నెల్‌ (Nell)’ (వీరిద్దరు మహిళలు), అమెరికా దేశస్తుడు షాహున్‌, ఇటలీ కి చెందిన పిత్రో ఇంకా రష్యాకు చెందిన కాస్మోనాట్స్‌ అంటోన్‌, రోమన్‌ ఈ మిషన్‌లో పాల్గొన్న పాత్రధారులు. ఈ నవల ప్రధాన ఉద్దేశం అంతర్జాతీయ అంతరిక్ష నౌకలో భూ కక్ష్య చుట్టూ పరిభ్రమించి పరిశోధనలు చేయడం. వీటితో పాటు అధికారికంగా చేసే కార్యాచరణ విషయాలు, అంతరిక్ష నౌకలో వ్యోమగాములు చేసే పనులపై అవగాహన కలుగజేయడం. అలాగే తాత్విక సంబంధమైన విషయాలు, మానవీయ అంశాలపై, భగవంతుడి ఉనికిపై అనేక విషయాల చర్చ కూడా సాగుతుంది. జీవితం ముఖ్య ఉద్దేశమేమిటి? లక్ష్యం ఏమిటి? అన్న వాటిపై దష్టి పెడుతుంది. ప్రతి అధ్యాయం 90 నిమిషాల వ్యవధితో సాగే భూమి చుట్టూ తిరిగే కక్ష్య పరిభ్రమణాన్ని 24 గంటల్లో 16 కక్ష్యలుగా (Orbits) విడదీసి విషయాలను చర్చిస్తుంది. వ్యోమగాముల్లో ఒకరైన ‘ఛే’ తన తల్లి మరణ వార్త విన్న తర్వాత ఆమె అనుభవించిన భావోద్వేగాలను, విషాదాన్ని చాలా ఆర్ద్రంగా తన రచనలో వ్యక్తీకరిస్తుంది రచయిత్రి. ఇతర వ్యోమగాముల సంతాప వచనాలు కూడా హదయాన్ని తాకుతాయి.
నవల చదువుతున్నంత సేపు నక్షత్ర మండలంలో తిరుగాడిన అనుభూతి పాఠకుడికి కలిగిస్తుంది. అనంతమైన విశ్వంలో జరుగుతున్న వైవిధ్యమైన సంఘటనలు, ఏకసూత్రంలో కట్టిపడేసిన ఉనికి, అంతరిక్ష నౌకలో వ్యోమగాముల స్నేహపూర్వకమైన పలకరింపులు, దైనందిన కార్యక్రమాలు, విచిత్రమైన అనుభవాలు, లింగ అసమానతలు, జాతి, మతం, వాతావరణ మార్పుల వర్ణన, జీవన్మరణాలపై తాత్విక చింతన, అంతరిక్షంలో తిరుగాడు సమయాన క్షణక్షణం మారుతున్న వాతావరణ ప్రభావాలు, భూమి మీద అనేక దేశాల వాతావరణం, అంతరిక్షంలోని వాతావరణ మార్పులలోని వైవిధ్యం, వ్యోమగాములు అనుభూతులు, శాస్త్రీయమైన విషయాలు పాఠకుడిని ఆశ్చర్యానికి పురిగొల్పుతాయి. అంతరిక్షం నుండి కింద వున్న భూమిని చూస్తున్నప్పుడు ఈ అనంతమైన విశ్వంలో వారి ఉనికి, అస్తిత్వం ఏమిటా? అని తలెత్తిన ప్రశ్న అనేక ఆలోచనలను ముందుకు తెస్తుంది. నవల రచన చేయడం ఒక ఎత్తయితే, తీసుకున్న వస్తువుకు శాస్త్రీయ సంబంధ విషయాలలోని సహజత్వాలు , వాస్తవాలను జత చేసి న్యాయం చేకూర్చడం రచయిత్రికి మేధోశ్రమను కలిగించే విషయం. ఒక ఇంటర్వ్యూలో సమంత హార్వే ‘ఈ నవల మనిషి వ్యక్తిత్వం, ప్రతిష్ట కోసం, కుటుంబ వాతావరణాన్నీ, మానవ సంబంధాలను, విలువలను ప్రతిబింబించదానికి చేసిన ప్రయత్నం’ అంటుంది .Edmund de Waal, Sarah Collins , Yiyun Li, Justine Jordan, Nitin Sawhney ఐదుగురు సభ్యులతో కూడుకున్న న్యాయనిర్ణేతల కమిటీ వీటన్నింటిని దష్టిలో ఉంచుకొని ఆ నవలను ఏకగ్రీవంగా ఎన్నుకుంది . ªSet on the
International Space Station over 24 hours, this short and lyrical novel charts the lives of the six people in the cramped spacecraft  as they observe the world beneath them, in all its beauty and vulnerability’ అని జ్యూరీ సభ్యులలో ఒకరైనEdmund de Waal, The Weekపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు, 2019 తరువాత మహిళా రచయిత్రులలో సమంత హార్వే బుకర్‌ ప్రైజ్‌ తీసుకున్న తొలి మహిళగా కమిటీ అభివర్ణించింది. 2019 లో Bernardine Evaristo, Margaret Atwood కలిసి గెలుచుకున్నారు. 24 గంటల్లో భూమి చుట్టూ అంతరిక్ష నౌకలో తిరుగాడుతూ అంతరిక్షాన్ని, భూమి మీది జీవరాశిని ఆరుగురు వ్యోమగాముల తాత్విక దష్టిలో మనకు రచయిత్రి అందిస్తుంది.
– డా . రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌
91778 57389

Spread the love